హాస్టల్​లో స్టూడెంట్​ను నగ్నంగా తిప్పిన్రు

హాస్టల్​లో స్టూడెంట్​ను నగ్నంగా తిప్పిన్రు

కోల్​కతా: పశ్చిమ బెంగాల్​లోని జాదవ్​పూర్ యూనివర్సిటీలో ర్యాగింగ్​కు విద్యార్థి బలైన ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. హాస్టల్​లోని బోర్డర్లను, సిబ్బందిని విచారించిన తర్వాత పోలీసులు గురువారం మీడియాతో మాట్లాడారు. సీనియర్లు ఓ మైనర్ స్టూడెంట్ ను బట్టలు విప్పించి నగ్నంగా తిప్పినట్లు తేలిందన్నారు. బెదిరింపులకు తాళలేక బాధితుడు పరుగులు పెట్టాడని, తప్పించుకునేందుకు ఒక్కో రూమ్​లోంచి మరో రూమ్​కు పరిగెత్తాడని చెప్పారు.

అలా గంటకుపైగా వేధించారని తెలిపారు. అంతకుముందు నుంచీ అతడిని గే అంటూ సీనియర్లు ఏడిపించినట్లు తెలిపారు. వర్సిటీలో బీఏ ఫస్టియర్ చదువుతున్న 17 ఏండ్ల బాధిత స్టూడెంట్​ ఆగస్టు 9న హాస్టల్​లోని రెండో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి చనిపోయాడు. సీనియర్ల ర్యాగింగ్ కారణంగానే తమ కొడుకు చనిపోయాడని బాధిత స్టూడెంట్ తల్లిదండ్రులు ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 12 మంది ర్యాగింగ్ చేసినట్లు ఆధారాలు దొరికాయని పోలీసులు పేర్కొన్నారు.