- ఇస్కాన్ అబిడ్స్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌లో భారీ ఊరేగింపు
- కదిలిరానున్న లక్షలాది మంది భక్తులు
అబిడ్స్/ పద్మారావునగర్, వెలుగు : నగరంలో ఈ నెల16వ తేదీన జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నారు. ఇస్కాన్ హైదరాబాద్ (అబిడ్స్) ఆధ్వర్యంలో జరగనున్న 47వ వార్షిక రథయాత్ర ఉదయం 11 గంటలకు ఇందిరాపార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ప్రారంభమై..ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, లిబర్టీ, బషీర్‌బాగ్, అబిడ్స్, ఎంజే మార్కెట్ మీదుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకుంటుందని ప్రతినిధి శంభు వైష్ణవ దాస్ తెలిపారు. ఇక్కడ సుమారు లక్ష మంది భక్తులకు మహాప్రసాద పంపిణీతో పాటు సాయంత్రం ప్రత్యేక హారతి, భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఇస్కాన్ కూకట్‌పల్లి ఆధ్వర్యంలో
ఇస్కాన్ కూకట్‌పల్లి ఆధ్వర్యంలో 16న హైదర్‌నగర్‌లోని పోచమ్మ-మైసమ్మ ఆలయం నుంచి జేఎన్‌టీయూ మీదుగా హుడా ట్రక్ పార్క్ వరకు సాగే రథయాత్ర సాగుతుందని, ఈ సందర్భంగా లక్ష మందికి అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు రథయాత్ర నిర్వహణ కమిటీ చైర్మన్ ఆంజినీ కుమార్ అగర్వాల్, అధ్యక్షుడు మహర్షి సంఘీ దాస్, చీఫ్ కోఆర్డినేటర్ సఖి దేవి వెల్లడించారు. 19న సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు చెప్పారు.
సికింద్రాబాద్‌లోనూ..
సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో 130 ఏళ్ల పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జగన్నాథ స్వామి రామ్‌గోపాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 16న జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 6:45 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దర్శనం ఉంటుందన్నారు. సాయంత్రం 4 గంటలకు జనరల్ బజార్‌లోని ఆలయం నుంచి రథయాత్ర ఊరేగింపు ప్రారంభమై.. ఎంజీ రోడ్, హిల్ స్ట్రీట్, రాణిగంజ్ నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటుందన్నారు.
