రూ. 34 వేల కోసం 14 ఏండ్లుగా పోరాటం... జగిత్యాల జిల్లాలో రైతు పోరాటం

రూ. 34 వేల కోసం 14 ఏండ్లుగా పోరాటం... జగిత్యాల జిల్లాలో రైతు పోరాటం
  •     2012లో జగిత్యాల జిల్లాలో డీ-3 కాల్వ కోసం ఓ రైతు భూమిని తీసుకున్న ప్రభుత్వం
  •     పరిహారానికి ప్రొసీడింగ్స్‌‌ వచ్చినా రైతుకు అందని చెక్కు
  •     చెక్కు కోసం తిరుగుతూనే బాధితుడు మృతి, డబ్బుల కోసం కొడుకు ప్రయత్నాలు
  •     సీఎం ఆదేశింంచినా కదలని ఫైల్‌‌

జగిత్యాల, వెలుగు : ఓ కాల్వ నిర్మాణం 2012లో భూమిని తీసుకున్న అప్పటి ప్రభుత్వం నష్టపరిహారానికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌‌ ఇచ్చినా.. చెక్కు మాత్రం చేతికి రాలేదు. పరిహారం కింద మంజూరైన రూ. 34,125 కోసం ఓ బాధితుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే కన్నుమూశాడు. తర్వాత అతడి కొడుకు సైతం ప్రొసీడింగ్స్‌‌ కాపీని పట్టుకొని ఆఫీసర్లను కలిసినా ఫలితం లేకుండా పోయింది.

 తమకు రావాల్సిన డబ్బుల కోసం 14 ఏండ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గంగాధర నారాయణకు సర్వే నంబర్ 802లో ఆరున్నర గుంటల భూమి ఉండేది. 2012లో డీ-3 కాల్వ నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం నారాయణ భూమిని స్వాధీనం చేసుకుంది. 

ఆ భూమికి నష్టపరిహారంగా రూ.34,125 మంజూరు చేస్తూ అధికారులు చెక్కు నంబర్ 429755తో ప్రొసీడింగ్స్‌‌ కాపీ ఇచ్చారు. ఆ కాపీని పట్టుకొని నారాయణ వందల సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా చెక్కు మాత్రం చేతికి రాలేదు. చివరకు అనారోగ్యంతో 2014లో నారాయణ కన్నుమూశాడు. తండ్రి చనిపోయాక అతడి కొడుకు శంకరయ్య.. ప్రొసీడింగ్స్‌‌ కాపీతో పాటు తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలతో కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. 

కానీ ఏ ఆఫీసర్‌‌ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో నిరాశగా తిరిగి వస్తున్నాడు. ఇటీవల ప్రజాభవన్‌‌లో సీఎం రేవంత్‌‌రెడ్డిని కలిసి వినతిపత్రం సైతం అందజేశారు. సమస్యను పరిష్కరించాలని సీఎం ఆఫీస్‌‌ నుంచి ఆదేశాలు వచ్చినా.. పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. ఈ విషయమై ఇరిగేషన్‌‌ ఏఈ రాజేశ్‌‌ ఖన్నా మాట్లాడుతూ... పరిహారానికి సంబంధించిన డబ్బు పీవో లేదా ట్రెజరీ ఆఫీస్‌‌లో డిపాజిట్‌‌ అయి ఉంటుందన్నారు. 
డబ్బులు ఇవ్వండి.. 

లేదంటే మా భూమి ఇచ్చేయండి

పరిహారానికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌‌ కాపీని పట్టుకొని 14 ఏండ్లుగా తిరుగుతున్నా ఆఫీసర్లు స్పందించడం లేదని శంకరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు చెక్కు అలాగే ఉందా ? ఎవరైనా కాజేశారా ? అని ప్రశ్నించాడు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి పరిహారమైనా ఇవ్వాలి..  లేదంటే తమ భూమినైనా తిరిగి అప్పగించాలని కోరాడు.