బైక్ పైన పోతరు.. ఎవుసం చేస్తరు

బైక్ పైన పోతరు.. ఎవుసం చేస్తరు


టీవీల్ల బైక్ యాడ్స్ చూస్తుండ్రు కదా! ఎట్లున్నయ్? నాజూకైన అమ్మాయి టీ షర్ట్ వేసుకుని, జీన్ప్యాంట్ కానీ కుర్తా–పైజామా వేసుకుని డ్రైవ్ చేస్తది. కంపెనీ ఏదైనా కనిపించేది ఇట్లనే. బైక్లని ఆఫీసులకు పోయే ఆడోళ్లే కొంటరని కంపెనీలోళ్లు అనుకుంటున్నరు. లక్ష్మీపూర్ల ఆడబిడ్డల్ని చూసినంక బైక్లు అమ్మేటోళ్లు మనసు మార్చుకున్నరు. వ్యవసాయం చేసేటోళ్లకు మా కంపెనీ బైక్ ఎట్ల మంచిగుటందో ఇంటింటికి తిరిగి చెప్తున్నరు. ఎందుకనుకుంటున్నరు. ఆ ఊళ్ల చేను పనులు చేసే అమ్మలక్కలు కూడా బైక్ నడపుతరు. చేనుకు పోతరు!  గదన్న మాట సంగతి. 


అన్ని ఊళ్లల సద్దికట్టుకుని చేనుకు బైలెల్లి భర్త వెనుక సీట్లో బైక్ మీద కూర్చునే భార్యల్ని చూస్తాం. ఏ ఊరికి పోయినా దారిపొంటి ఇట్లనే కనవడుద్ది. కానీ, లక్ష్మీపూర్ల మాత్రం కొంచెం డిఫరెంట్. రోడ్డుపొంటి రయ్.. రయ్మంట పోయే బైక్లని ఆడబిడ్డలే ఉరికిస్తున్రు! ‘వెనకాల కూసున్నంతకాలం ఎనుకబడే ఉంటం.  ఎందుకుపోవాల్నంటే ముందు సీట్లో కూసోవాలె’ అంటున్నరు లక్ష్మీపూర్ ఆడబిడ్డలు. ఇంటిపని, చేను పని ఒంటిచేత్తో హ్యాండిల్ చేసే ఆడబిడ్డల చేతికి బైక్ వచ్చింది. మారుతున్న కాలంతోపాటే ఊళ్లన్నీ మారుతున్నది నిజమే. అన్ని ఊళ్ల కంటే ముందే మార్పును తెచ్చే ఊరు లక్ష్మీపూర్ల.. ‘మా చేతికి వచ్చాయి తాళాలు.. ఇక తగ్గదు మా జోరు’ అంటూ పోతున్న అమ్మలక్కలు సౌలత్ ఎట్లున్నదో చూడున్రి!  

ఊళ్ల ఎక్కువ కష్టపడేది ఎవరు? 
రైతు. 
రైతుల్లో ఎక్కువ కష్టపడేది ఎవరు? 
మహిళా రైతులు. 
చేను పనితోపాటే ఇంటి పని, పిల్లల బాధ్యతలు చూసేది ఆడబిడ్డలే. అందరూ కోడి కూసినంక లేస్తే. ఆడబిడ్డలు మాత్రం కోడి కూయకముందే లేస్తరు. పొద్దు పొడవకముందే మొదలైన పని పొద్దుగుంకినా తీరదు. అంత చాకిరీ చేస్తరు ఆడోళ్లు. వంటపని, పిలగాండ్లను బడికిపంపుడు. పెద్దోళ్లను సూసుకొనుడంతా ఆడోళ్ల బాధ్యత. ఇంత పనిచేసినా మల్లా చేనుకు పోవాలె. చాకిరి చేయాలె. ఇదంత ఎవరి కోసం.. మన కోసమే అనుకుంటరు. కాబట్టి ఇదేమీ కష్టమనుకోరు. ఇష్టంగా చేస్తుంటరు. ఒక పని ఎక్కువ చేస్తున్నమని ఎవరికైనా నిమిషం ఎక్కువ ఉంటదా? అందరికీ ఇరవై నాలుగు గంటలే. 

చేను కాడ మనమే.. చెల్కలోన మనమే..  

పొద్దంతా కష్టపడే లక్ష్మీపూర్ ఆడబిడ్డలు ఇంటి పనులన్నీ చేసుకుని చేనుకుపోయేప్పుడు లేట్ కాకూడదని బైక్ల మీద పోతున్నరు. ఒకలు కాదు, ఇద్దరు కాదు. ఊళ్ల బైక్ మీద చేనుకుపోయి, కలుపు తీసేటోళ్లు, గడ్డికోసేటోళ్లు ఎంతమంది ఉన్నరో లెక్క తేలది. యాడికైనా తొందరగ పోవాల్నంటే ఎవరైనా లిఫ్ట్ ఇస్తరేమోనని ఎదరుచూసే ఊరి జనాలకు నిజంగా ఇది ఇచ్ఛంత్రమే. జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్లో మాత్రం డైలీ లైఫ్లో వ్యవసాయం చేసే ఆడోళ్లు బైక్ల మీద చేనుకుపోవుడు రొటీన్. ఇప్పుడీ ఊళ్లో వందకు పైగా బైకులున్నయ్. నడిపేవాళ్లు అంతకంటే ఎక్కువమందే ఉన్నరు.

ఎవుసంలో యువతులే ఎక్కువ

లక్ష్మీపూర్ (జగిత్యాల రూరల్ మండలం) పంటచేలల్లో ఎన్నో రకాల పంటలు పండిస్తున్నరు. ఈ ఊళ్ల అడుగుపెట్టిన ప్రతి కోడలూ చేల పనికి పోవాల్సిందే. అగ్రికల్చర్ల ఈ ఊరు శానా ఫేమస్. ఐకమత్యంతో లక్ష్మీపూర్ రైస్తో మంచి పేరు తెచ్చుకున్నరు. అట్లనే లక్ష్మీపూర్ సీడ్స్ ప్రొడక్షన్తో చాలా ఫేమస్ అయినరు. సంప్రదాయ సాగు, ఆధునిక పద్ధతుల్లో సాగు చేసే ఈ ఊరి రైతులకు ఆదాయం ఎట్లుందో? లాభాలు కూడా అట్లనే ఉన్నయ్. ఆ లాభాల తీరుగనే లైఫ్స్టైల్ గూడ మారింది. ఇంటి కోడళ్లు కూడా చేనుకు పోతున్నరు. ఇంటిపని, చేను పని కోసం చదువుకున్న కోడళ్లు బైక్ తీస్కోని చేనుకుపోతున్నరు. అత్తాకోడళ్లు అంటెనే టీవీ సీరియళ్ల లెక్క చీటికి మాటికి తగువులుంటయ్ అనుకుంటరు. కానీ, ఈ ఊళ్లో రోడ్డు పొంటి అత్తను వెనుక కూసోబెట్టుకని పోయే కోడళ్లను చూస్తె భలే ముచ్చటేస్తది. ముందుసీట్లో కూసోని ఇంటిని నడిపించే కోడళ్లను చూడాల్నంటే లక్ష్మీపూర్ పోవాల్సిందే. 

పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ చదివిన తర్వాత వ్యవసాయ పనులు చేసే వాళ్లంతా బైక్ రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేనుకి నడిచిపోకుండా బైక్ మీద పోతున్నరు. ఎరువులు బైక్ ముందు పెట్టకుని బాధ్యతల్ని భర్తలతో సమానంగ పంచుకుంటున్నరు. పురుగు ముందులు తీస్కపోవుడే కాదు, ఒకరిద్దరు కూలీలు అవసరం పడ్డప్పుడు ఇట్ల బైక్ మీదనే తీస్కపోతున్నరు. బిడ్డల్ని బాగా సదివించాల్ననే తల్లులు కొంచెం ముందే ఇంటికి చేరి, హోమ్ వర్క్ చేయించాల్నంటే ముందే బయలెల్లాలె. ఒక్కతే ఇంటికి చేరాల్నంటే బైక్ అవసరమని ఫ్యామిలీలో కూడా సపోర్ట్ చేస్తున్నరని లక్ష్మీపూర్ తల్లులంటున్నరు. 

ఫేమస్ ఎట్లయినరంటే?

ఈ ఊరి రైతులు పసుపు, వరి, మొక్కజొన్న వేరుశెనగ లాంటి పంటల్ని పండిస్తున్నరు. లక్ష్మీపూర్ రైతు సహకార సంఘం ఏర్పాటు చేసుకుని రైస్ని మార్కెటింగ్ చేస్తున్నరు. అట్లనే ఈ ఊళ్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి వంగడాన్ని పండిస్తరు. పొలాసల ఉన్న అగ్రికల్చర్ కాలేజ్ సాయం తీస్కోని ఈ వంగడాన్ని పండించి, ఆ వంగడానికి ఊరి పేరే పెట్టినరు. అట్ల లక్ష్మీపూర్ రైస్తోపాటే లక్ష్మీపూర్ రైతులు కూడా ఫేమస్ అయినరు. 

ఊళ్లనే బైక్ మేళా!

ఈ ఊళ్ల ఎక్కువగ మిశ్రమపంటలేస్తరు. అందువల్ల వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటయి. వేన్నీళ్లకు చన్నీళ్లు తోడైనట్లు ఆడవాళ్ల తోడు ఉంటేనే పనులు అయితయ్. ఇంటిపనంతా చేసి, తర్వాత చేనుకు పోయే ఆడవాళ్లు రెండు, మూడు కిలోమీటర్లు దూరం ఉన్నచేనుకి ఒక్కరే నడుచుకుంటూ పోవడం కష్టం. కాబట్టి భర్తలు కూడా బైక్ కొని, భార్యల్ని డ్రైవింగ్ చేయమని ఎంకరేజ్ చేస్తున్నరు. డిమాండ్ ఎక్కడుంటే అక్కడ మార్కెట్ పెంచుకోవాల్ననే కంపెనీలు బైక్లు అమ్ముకోవాల్నని ఈ ఊరికి వచ్చినయ్. ‘మా స్కూటీలు కొనండి. పంట చేతికి వచ్చినంక డబ్బులు కట్టండి’ అంటూ ఆటోమొబైల్ కంపెనీల వాళ్లు ఊరికే వచ్చి మేళాలు పెట్టినరు. 

కష్టకాలంల అక్కరకొచ్చినది 

మా ఆయన ఫారిన్లో పని చేస్తుండె. అప్పుడు చేను పనుల బాధ్యత, ఇంటి బాధ్యత నాదే కదా. ఇన్ని పనులు చూసుకోవాల్నంటే కష్టంగ ఉండె. బైక్ తీసుకున్నంక టైమ్ కలిసొచ్చింది. ఎవుసం చేసుడు కష్టమనిపించలే. ఇప్పుడు మా ఆయన ఇక్కడే ఉంటున్నడు. వ్యవసాయం అలవాటు అయింది. ఇక మానుకోకుండ ఇద్దరం కలిసే చేస్తున్నం. -  నలువాల లక్ష్మీ

బైకే బతికిస్తంది

మాది మొదాల్నుంచి వ్యవసాయ కుటుంబమే. చిన్నప్పటి నుంచి చేను పనులు అలవాటే. మా ఆయన మెడికల్ షాప్ నడుపుతడు. ప్రతి రోజూ పొద్దున జగిత్యాలకు పోతడు.  షాప్లోకి కావాల్సిన మెడిసిన్స్ తెస్తడు. ఇంటికి అచ్చినంక ఆ బైక్ మీద చేనుకుపోత. చేను పనులన్నీ చూస్కోని సాయంత్రం పొద్దగూకకముందే ఇంటికి వస్త. - యల్లా పద్మ 

బైకే మా బతుకు బండి 

ఇద్దరం కలిసే చేనుకు పోతం. అవసరం పడితె నేను బైక్ నడుపుత. ఒక్కదాన్నే దూరంల ఉన్న చేనుకు పోవాల్నంటే బైక్ మీద పోత. బైక్ ఉండబట్టే వ్యవసాయ పనులు తేలిగ్గ చేస్తున్న. - పన్నల సుజాత, దుగ్యాల గోపీకృష్ణ