- సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబం
జగిత్యాల, వెలుగు: సౌదీ అరేబియాలో గొర్రెల కాపరిగా తీవ్ర కష్టాలు పడుతున్నానని, తనను స్వదేశానికి తీసుకురావాలని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీ రాజ్పల్లి గ్రామానికి చెందిన దాసరి అరవింద్(23) వేడుకుంటూ పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం తాను సౌదీ రాజధాని రియాద్‌కు సుమారు 950 కిలోమీటర్ల దూరంలోని ఎడారి ప్రాంతంలో పని చేస్తున్నట్లు తెలిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ‘ప్యాకింగ్ వర్కర్’ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ ఏజెంట్ రూ.90 వేలు తీసుకొని సౌదీకి పంపించాడని, ప్రస్తుతం తనను ఎడారిలో గొర్రెల కాపరిగా పని చేయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
అక్కడ తాగునీరు, ఆహారం, విద్యుత్, సరైన వసతి సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. అరవింద్ పంపిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యజమాని బలవంతంగా అతని వాట్సాప్, ఫేస్‌బుక్ ఖాతాలను తొలగించడంతో పాటు ఇండియా సిమ్ కార్డును కూడా లాక్కున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్లో సీఎం అరవింద్ తల్లి రాజవ్వ వినతిపత్రం సమర్పించారు.
