గ్రామీణ యువతకు ఉపాధి కల్పిస్తాం..జహీరాబాద్ SIHMను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేస్తాం

గ్రామీణ యువతకు ఉపాధి కల్పిస్తాం..జహీరాబాద్ SIHMను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేస్తాం
  •     మంత్రి జూపల్లి కృష్ణారావు

జహీరాబాద్, వెలుగు; గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కవేలి చౌరస్తాలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ భవనంలో  ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యాటక వారోత్సవాల్లో పాల్గొన్నారు. జహీరాబాద్‌‌‌‌ నియోజకవర్గంలోని  స్టేట్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌‌‌‌మెంట్ (ఎస్‌‌‌‌ఐహెచ్‌‌‌‌ఎం)ను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. 

ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో కొత్తగా ప్రవేశపెట్టిన బేకరీ, కన్ఫెక్షనరీ కోర్సులను ప్రారంభించారు. వీటితో పాటు నిథమ్ విద్యా సంవత్సరానికి సంబంధించిన బీబీఏ, ఎంబీఏ కోర్సుల అడ్మిషన్లను ప్రారంభించారు. అనంతరం పర్యాటక శాఖ రూపొందించిన టూరిస్ట్ గైడ్ పోస్టర్‌‌‌‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా నిరుపయోగంగా ఉన్న ఎస్‌‌‌‌ఐహెచ్‌‌‌‌ఎంను  ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 

గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్‌‌‌‌ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్  వాణిప్రసాద్,  కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ, మాజీమంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ యునుస్ పాల్గొన్నారు.