ఏడు బస్తాల రూపాయి నాణేలతో భార్యకు భరణం

ఏడు బస్తాల రూపాయి నాణేలతో భార్యకు భరణం

జైపూర్​: రూపాయి, రెండు రూపాయిల నాణేలతో రూ.55వేల మెయింటెనెన్స్ బకాయిలు చెల్లించేందుకు జైపూర్​లోని ఫ్యామిలీ కోర్టు ఓ వ్యక్తికి అనుమతించింది. 11 నెలలలపాటు తన భార్యకు మెయింటెనెన్స్ చెల్లించకపోవడంతో దశరథ్​ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో బకాయి చెల్లించేందుకు అతడి కుటుంబ సభ్యులు ఏడు బస్తాల్లో రూపాయి నాణేలును  కోర్టుకు తీసుకువచ్చారు. దీంతో నాణేల రూపంలో బకాయి చెల్లించడాన్ని భార్య తరఫున న్యాయవాది మానసిక వేధింపులుగా పేర్కొన్నా కోర్టు అంగీకరించలేదు. కోర్టులోనే నాణెలను లెక్కించి రూ.వెయ్యి చొప్పున ప్యాకెట్లను తయారుచేసి ఆమెకు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

కాగా, జైపూర్​లోని హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్​ అనే వ్యక్తి, అతడి భార్య సీమ విడాకుల కేసుపై ఫ్యామిలీ కోర్టులో విచారణ జరుగుతున్నది. ఈనేపథ్యంలో నెలకు రూ.500 మెయింటెనెన్స్ అతడి భార్యకు ఇవ్వాలని కోర్టు దశరథ్​ను ఆదేశించింది. అయితే  గత 11నెలలుగా చెల్లించలేదు. మెయింటెనెన్స్ చెల్లించనందుకు దశరథ్​పై కోర్టు రికవరీ వారెంట్​జారీ చేసింది. దీంతో అతడిని  జూన్​ 17న పోలీసులు  అరెస్టు చేశారు. ఫ్యామిలీ కోర్టుకు సెలవులు కావడంతో దశరథ్​ను అడిషనల్​ డిస్ర్టిక్ట్ జడ్జి (ఏడీజీ) ఎదుట హాజరుపరిచారు. ఈక్రమంలో కోర్టుకు దశరథ్​ కుటుంబ సభ్యులు రూ.55వేల నాణేలను తీసుకువచ్చారని అతడి తరఫున న్యాయవాది రమణ్​గుప్తా తెలిపారు. రూపాయి, రెండు రూపాయిల నాణేలను ఏడు బస్తాల్లో నింపి తెచ్చారని వెల్లడించారు. సీమ తరఫున న్యాయవాది రాంప్రకాశ్​ అభ్యంతరం వ్యక్తం చేయగా, నాణేలు చట్టబద్ధమైనవని వాటిని తిరస్కరించలేమని రమణ్​గుప్తా వాదనను జడ్జి అంగీకరించారు. ఈ నెల 26న జరిగే ఫ్యామిలీ కోర్టు విచారణలో నాణేలను లెక్కించి వెయ్యిరూపాయిల ప్యాకెట్లను అందజేయాలని, అప్పటివరకు నాణేలు కోర్టు కస్టడీలో ఉంటాయని న్యాయమూర్తి తెలిపారు.