బ్లూటూత్‌ పేలి యువకుడి మృతి: 5 నెలల క్రితమే పెండ్లి..

బ్లూటూత్‌ పేలి యువకుడి మృతి: 5 నెలల క్రితమే పెండ్లి..

జైపూర్‌‌: బ్లూటూత్ హెడ్‌ ఫోన్స్ పేలి 28 ఏండ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌‌ జిల్లాలో శుక్రవారం నాడు జరిగింది. జిల్లాలోని  ఉదయ్‌పురియా గ్రామానికి చెందిన రాకేశ్‌ కుమార్ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. రోజూ లానే శుక్రవారం కూడా ఆన్‌లైన్‌ వీడియోలు చేస్తూ చదువుకుంటున్న అతడు బ్లూటూత్‌ పెట్టుకుని క్లాసులు వింటున్నాడు. ఆ సమయంలో చార్జింగ్ అయిపోవడంతో దానిని చెవిలోనే ఉంచుకుని చార్జర్ కనెక్ట్‌ చేశాడు. దీంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా బ్లూటూత్ హెడ్‌సెట్‌ పేలిపోయింది. సడన్‌గా చెవిలో ఉన్న డివైజ్ పేలడంతో రాకేశ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

బ్లూటూత్ పేలుడు వల్ల రెండు చెవులకు తీవ్రమైన గాయాలయ్యాయని, బాధితుడి ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడని డాక్టర్ ఎల్‌ఎన్ రుండ్లా తెలిపారు. అతడు గాయాల వల్ల కాక, గుండె పోటు కారణంగా మరణించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రాకేశ్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెండ్లి అయిందని పోలీసులు తెలిపారు.