తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు వెంటనే చేపట్టాలి... కాళేశ్వరం అవినీతి సొమ్మును రికవరీ చేయాలి

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు వెంటనే చేపట్టాలి... కాళేశ్వరం అవినీతి సొమ్మును రికవరీ చేయాలి
  • తెలంగాణ జలసాధన సమితి ​రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
  • అప్పటి పాలకులపై క్రిమినల్ కేసులు పెట్టాలి.. ఇష్టారీతిన లక్ష కోట్లు బూడిద పాలు చేశారు
  • బ్యారేజీల పునర్నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని వృథా చెయ్యొద్దని సూచన

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రకృతి విరుద్ధమైన ప్రాజెక్టు అని.. రీ డిజైనింగ్, రీ ఇంజనీరింగ్ పేరిట ఎదురు ఎత్తిపోతలు చేపట్టి ఉద్దేశపూర్వకమైన అవినీతికి పాల్పడ్డారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం పేరిట లక్ష కోట్ల అనితీకి పాల్పడ్డ బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి,  అవినీతి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం రీ కన్ స్ట్రక్షన్ పేరిట ప్రజాధనాన్ని వృథా చేయకుండా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి, ఎల్లంపల్లికి నీళ్లను తీసుకురావాలని కోరారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో ‘‘కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు భవిష్యత్తు? అవినీతికి స్మారకంగా అలా వదిలేయాల్సిందే.. తుమ్మిడి హెట్టి నిర్మాణం చేపట్టాలి” అనే అంశాలపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గురువారం తెలంగాణ జలసాధన సమితి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి అధ్యక్షత రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు. సమావేశంలో మాజీ మంత్రి విజయరామరావు, ప్రాణహిత పరిరక్షణ వేదిక కన్వీనర్ కేవీ ప్రతాప్, సీపీఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య, మాజీ ఇంజనీరు విఠల్ రావు, పృథ్విరాజ్, జర్నలిస్ట్ అవధాని, చీఫ్ ఇంజనీర్ జియో ఉద్దీన్, సాంబశివరావు, ఉపేందర్ రెడ్డి, సీసీఐ ఎమ్ఎల్ ప్రసాద్, ఏఐకేఎమ్ఎస్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైనాల గోవర్ధన్ మాట్లాడుతూ.. ఎన్డీఎస్ఏ ప్రైమరీ, తుది నివేదికలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నిర్మాణం, ఎగ్జిక్యూషన్, ఓ అండ్ ఎమ్ లలో, బ్యారేజీ భూమిలో కుంగిపోయే వరకు జరిగిన ఘోరమైన నిర్లక్ష్యం, తప్పులను నీగ్గు తేల్చిందన్నారు. మేడిగడ్డ మూడు బ్యారేజీలో పునరుద్ధరణకు పెట్టే ప్రతి పైసా వృథా ఖర్చు అన్నారు.  

అవినీతిపరులను ఎందుకు అరెస్టు చేయడం లేదు?

ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా.. ఎన్డీఎస్ఏ అన్ని నివేదికలు ఇచ్చినా.. అవినీతిపరులను కాంగ్రెస్ పార్టీ ఎందుకు శిక్షించడం లేదు. అవినీతి చేసి లక్షల కోట్లు సంపాదించిన వాళ్లు హాయిగా ఉంటున్నారు. అవినీతి సొమ్మును రికవరీ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? అనివీతిపరులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. వారినుంచి అవినీతి సొమ్మును రికవరి చేయాలి. తుమ్మిడిహెట్టి ఒరిజినల్ డిజైన్ పర్​ఫెక్టుగా ఉంది. పునర్నిర్మాణం పేరుతో కాళేశ్వరం మీద డబ్బును వృథా చెయ్యకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించాలి.- జస్టిస్ చంద్రకుమార్

తుమ్మిడిహెట్టి నిర్మాణం చేపట్టాలి

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం మూడు బ్యారేజీల పేరిట గోదావరిపై ఎదురు ఎత్తిపోతలు నిర్మించడం తప్పు. వరద నీరును కిందికి వదిలేయడం.. మళ్లీ ఎత్తిపోయడం సాధ్యం కాదు. తుమ్మిడి హెట్టి నిర్మించి ఎల్లంపల్లికి నీరు ఇవ్వడమే సమంజసం. లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. మేడిగడ్డ తదితర బ్యారేజీల పునరుద్ధరణ కోసం డబ్బు ఖర్చు చేయకుండా, తుమ్మిడి హెట్టి వెంటనే చేపట్టాలి. - ఎమ్మెల్సీ కోదండరాం

ఇంజనీర్​ను శిక్షిస్తే సరిపోదు

కేసీఆర్ ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా లేడు. దోపిడీదారుగా ఉన్నారు. లక్ష కోట్లు కాళేశ్వరంలో దుర్వినియోగం అయ్యాయి. 300 కోట్లు ఒక అధికారి ధనార్జన అయితే.. ఆ ప్రభుత్వ పెద్దల వద్ద ఎన్ని వేల కోట్ల ధనం ఉండాలి. ఇతర దేశాల్లో అయితే ఉరిశిక్ష వేస్తారు. కాళేశ్వరంపై సమిష్టిగా నీటిపారుదల శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని కలుద్దాం. వి ప్రకాశ్ అనే వ్యక్తి కాళేశ్వరం – కాంగ్రెస్ కుట్రలు అని చెప్పుకుంటూ తిరుగుతున్నడు. - మధు యాష్కీ

అంత నీరు నిల్వ ప్రమాదకరం   

ఇసుక బెడ్స్ పైన బ్యారేజీలు, ప్రాజెక్టులు కట్టడం ప్రకృతి విరుద్ధం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, 3 బ్యారేజీలు ఇసుక బెడ్ పైన కట్టినవి. భూమి అడుగు పునాదిలో బండరాయి లేదు. ప్రతి బ్యారేజ్ లో రెండున్నర టీఎంసీల కంటే ఎక్కువ నీరు నిలువ చేయకూడదు. మేడిగడ్డలో 16, అన్నారంలో 12 సుందిళ్ల లో 8 టీఎంసీలు నిల్వ చేయడం అత్యంత ప్రమాదకరం. చాలా భారీగా ఎత్తులో నీటి నిలువ ఉండడం వల్ల పునాదిపై, స్పిల్ వే పై ఒత్తిడి పడింది. గేట్ల నుంచి ఎత్తిపోస్తున్న నీరు చాలా శక్తివంతంగా సాండ్ బెడ్ ని, ముందు భాగాలని ఢీ కొట్టి గొయ్యి ఏర్పరిచింది. 

  హైడ్రాలజీ నిపుణుడు పీ గంగాధర శాస్త్రీ