- రిజిస్టర్ లో బినామీల పేర్లు నమోదు
- సెంటర్ ఇన్చార్జ్ తో మార్కెట్ పాలకవర్గం వాగ్వివాదం
జమ్మికుంట, వెలుగు: కరీంనగర్జిల్లా జమ్మికుంట మార్కెట్లోని గన్నీ సంచులు మాయమవుతున్నాయి. మార్కెట్లో మక్కల కుప్పలు లేకున్నా గన్నీ సంచులను బినామీ రైతుల పేర్లపై సెంటర్ ఇన్చార్జ్ బయటకు తరలిస్తున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో వారం రోజులుగా దళారుల దందా యథేచ్ఛగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మార్కెట్లో ఈనెల 14న రిజిస్టర్లో 126 మంది పేర్లు రాసి ఉన్నాయి. కానీ ఆరోజు కేవలం 63 మంది రైతులు మాత్రమే మార్కెట్లో మక్కలు కుప్పలు పోసి బార్ధాన్ తీసుకున్నారు.
15న 97 మంది పేర్లు రిజిస్టర్లో నమోదు కాగా కేవలం 47 మంది మాత్రమే రైతులు ఉన్నట్లు తేలింది. వారం రోజులుగా సెంటర్ ఇన్చార్జ్ దళారులతో కుమ్మక్కై మార్కెట్లో నిజమైన రైతులకు సంచులు ఇవ్వకుండా బయట వ్యాపారం చేసుకునే వారికి సహకరిస్తూ వారికి ఇస్తున్నారు. ఫలితంగా రైతులు మార్కెట్ లోనే పడిగాపులు కాస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ సభ్యులు గురువారం సెంటర్ ఇన్చార్జ్అశోక్ను ప్రశ్నించగా వారి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. తమను మోసం చేస్తున్నావంటూ సెంటర్ ఇన్చార్జ్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారులతో కుమ్మక్కై మక్కలను రూ.1600 , 1700కే క్వింటాల్ చొప్పున కొనుగోలు చేసి అవే మక్కలను తిరిగి మార్క్ఫెడ్ కు అమ్ముతున్నారని. రవాణా చేసే లారీల విషయంలోనూ గోల్మాల్ చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు.
