- కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఘటన
జమ్మికుంట, వెలుగు: కరీంనగర్జిల్లా జమ్మికుంట పట్టణంలో బుధవారం అర్ధరాత్రి కొంత మంది యువకులు దౌర్జన్యం చేశారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం తూరుబాయి గూడెం గ్రామానికి చెందిన నలమాద ఆంజనేయులు, వ్యాన్ డ్రైవర్ ఆవుల రాములు, మరొక వ్యక్తి కలిసి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొత్తపల్లి గ్రామంలో మూడు ఎడ్లను కొన్నారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా జమ్మికుంటకు చేరగానే బుధవారం అర్ధరాత్రి పాత మున్సిపాలిటీ వద్ద సుమారు 12 నుంచి 15 మంది యువకులు చిత్తుగా మందు తాగి వ్యాన్‌ను అడ్డగించారు. బంగారం, నగదు ఇవ్వాలంటూ వ్యాన్ అద్దాలు పగలగొట్టారు. ఆంజనేయులు వద్ద ఉన్న చేతికి ఉన్న ఉంగరం, రూ.8వేల నగదు లాక్కున్నారు.
అతని ఫోన్‌లోని రూ.2వేలు ఫోన్ పే చేయించుకున్నారు. డ్రైవర్ రాములు నుంచి రూ.10వేలు లాక్కున్నారు. అనంతరం వారిని ఆటోలో ఎక్కించుకొని దుబ్బ మల్లన్న ఆలయ పరిసరాల్లోకి తీసుకెళ్లి రూ.లక్ష ఇవ్వాలని లేకపోతే చంపుతామని బెదిరించారు. బాధితులు కాళ్లు మొక్కినా వినకుండా సుమారు మూడున్నర గంటల పాటు నరకయాతన పెట్టారు. అటుగా కొంతమంది బైక్‌పై వస్తుండగా వారిని చూసి వదిలివేయడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే తరహాలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఓ ప్రభుత్వ టీచర్‌పై సైతం యువకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
