- బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేసే అంశంపై పవన్ నిర్ణయమే ఫైనల్
- ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్
జీడిమెట్ల, వెలుగు: రాష్ట్రంలో జరిగే మున్సిపల్, గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ మరోసారి స్పష్టం చేశారు. కూకట్పల్లిలోని పార్టీ కార్యాలయంలో మల్కాజిగిరికి చెందిన పలువురు ఆదివారం జనసేనలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా పార్టీని బలోపేతం చేస్తున్నామని, పార్టీ పట్ల ఆకర్షితులై అనేక మంది ప్రధానంగా యువత పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
ముందుగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నామని, ఇందుకోసం బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామన్నారు. రిజర్వేషన్లు ఖరారు కాగానే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సైతం జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసే అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రస్తుతం పార్టీ బలోపేతం కోసం కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
