రఘునాథపల్లి /లింగాల ఘనపూర్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం లింగాల ఘనపూర్ మండలం నెల్లూట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలో నాణ్యత, పారదర్శకత పెరగాలని, పాఠశాలల్లో కల్పిస్తున్న ఆధునిక వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జియోగ్రఫీ, ఎకనామిక్స్, రాజ్యాంగ అంశాలను విద్యార్థులకు సులభంగా బోధించాలని, ప్రతి ఉన్నత పాఠశాలలో ప్రపంచ పటం, భారత భౌతిక-రాజకీయ పటాలు, రాజ్యాంగ సమాచార పట్టికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం పదో తరగతి గదిని సందర్శించి గణితంలోని పలు సూత్రాలను విద్యార్థులకు సులభంగా వివరించి, పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు.
