నేడు జావెలిన్‌ త్రో ఫైనల్‌

నేడు జావెలిన్‌ త్రో ఫైనల్‌

రోహిత్‌ యాదవ్‌పై కూడా ఆశలు

19 ఏళ్ల కిందట.. వరల్డ్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియాకు బ్రాంజ్‌‌ మెడల్‌‌ వచ్చింది..! మళ్లీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది లెజెండ్స్‌‌.. ఎన్నోసార్లు ప్రయత్నించినా.. పతకం సాధించలేకపోయారు..! కానీ ఇప్పుడు ఆ గొప్ప అవకాశం టోక్యో గోల్డెన్‌‌ బాయ్‌‌ నీరజ్‌‌ చోప్రా ముంగింట నిలిచింది..! ఒకే ఒక్క త్రోతో జావెలిన్‌‌ ఫైనల్లోకి దూసుకెళ్లిన చోప్రా.. నేడు జరిగే టైటిల్‌‌ ఫైట్‌‌కు రెడీ అయ్యాడు..! ఇంటర్నేషనల్‌‌ టోర్నీల్లో ఇప్పటికే సంచలనాలు సృష్టించిన ఇండియన్‌‌ అథ్లెట్.. మెగా చాంపియన్‌‌షిప్‌‌లో పసిడిని పట్టేయాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నాడు..! నీరజ్‌‌ నైపుణ్యం, సామర్థ్యంపై అనుమానాలు లేకపోయినా... పోటీ మాత్రం మరో లెవెల్లో ఉంది..! మరి దీనిని అధిగమించి కొత్త చరిత్ర సృష్టిస్తాడా? లేదా? అన్నది వేచి చూడాలి..!!

యుగీన్‌‌‌‌: ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశల మధ్య.. వరల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో అడుగుపెట్టిన ఇండియా స్టార్‌‌ అథ్లెట్‌‌ నీరజ్‌‌ చోప్రా.. ఆఖరి అంకానికి రెడీ అయ్యాడు. టోక్యో ఒలింపిక్స్‌‌ ఫామ్‌‌ను కొనసాగిస్తూ.. మెగా చాంపియన్‌‌షిప్‌‌లో ఆదివారం జరిగే జావెలిన్‌‌ త్రోకు సిద్ధమయ్యాడు. నీరజ్‌‌తో పాటు రోహిత్‌‌ యాదవ్‌‌ కూడా మెడల్‌‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుత ఫామ్‌‌ను పరిగణనలోకి తీసుకుంటే నీరజ్‌‌కు మెడల్‌‌ గెలవడం పెద్ద సమస్య కాదు. కానీ గోల్డ్‌‌ మెడల్‌‌ను సాధించాలన్న ఏకైక లక్ష్యంతో అతను బరిలోకి దిగుతున్నాడు. దాంతో పాటు 19 ఏళ్ల కలను కూడా నెరవేర్చాలని పట్టుదలతో ఉన్నాడు. 2003 పారిస్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో లాంగ్‌‌ జంపర్‌‌ అంజు బాబీ జార్జ్‌‌ బ్రాంజ్‌‌ మెడల్‌‌ను గెలిచింది. మళ్లీ ఆ తర్వాత ఇండియాకు మెడల్‌‌ దక్కలేదు. దీంతో నీరజ్‌‌పై ఒత్తిడితో పాటు ఆశలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 

తొలి ఫైనల్‌‌..

వాస్తవానికి నీరజ్‌‌ గతంలోనే వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బరిలోకి దిగినా.. సరైన ఫామ్‌‌ను చూపలేకపోయాడు. 2017 లండన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఫైనల్స్‌‌కు అర్హత సాధించలేదు. అటోమేటిక్‌‌ క్వాలిఫికేషన్‌‌ 83 మీటర్లను అందుకోలేకపోయాడు. అప్పట్లో నీరజ్‌‌ బెస్ట్‌‌ త్రో 82.26 మీటర్లు. మోచేతి గాయం నుంచి కోలుకోకపోవడంతో 2019 దోహా చాంపియన్‌‌షిప్‌‌లో ఆడలేదు. దీంతో ఇప్పుడు జరుగుతున్న చాంపియన్‌‌షిప్‌‌ అతనికి తొలి ఫైనల్‌‌. ‘క్వాలిఫయింగ్‌‌ రౌండ్‌‌ ఎలా ఉన్నా.. ఫైనల్లో వంద శాతం కష్టపడతా. ప్రతి రోజు భిన్నంగా ఉంటుంది. ఎవరు ఎంత దూరం ఈటెను విసురుతారో ఊహించలేం. ఇప్పుడు చాలా మంది త్రోయర్స్‌‌ మంచి ఫామ్‌‌లో ఉన్నారు. ఈ ఏడాది ఐదారుగురు పర్సనల్‌‌ బెస్ట్‌‌ను నమోదు చేశారు. కాబట్టి పోటీ తీవ్రంగా ఉంటుంది’ అని నీరజ్‌‌ పేర్కొన్నాడు. 

అండర్సన్‌‌‌‌తో ప్రమాదం..

క్వాలిఫయింగ్‌‌ రౌండ్‌‌లో తొలి ప్రయత్నంలోనే  నీరజ్‌‌ ఈటెను 88.39 మీటర్ల దూరం విసిరాడు. దీంతో అటోమేటిక్‌‌ క్వాలిఫికేషన్‌‌ మార్క్‌‌ (83.50 మీటర్లు) ఈజీగా అందుకుంటూ ఫైనల్‌‌కు అర్హత సాధించాడు. మొత్తం 12 మంది అథ్లెట్లు ఫైనల్లో బరిలోకి దిగుతారు. అయితే అందరికంటే ఎక్కువగా డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌, గ్రెనెడా అథ్లెట్‌‌ అండర్సన్‌‌ పీటర్సన్‌‌ (89.91 మీ.) నుంచి నీరజ్‌‌కు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ సీజన్‌‌లో అండర్సన్‌‌ మూడుసార్లు 90 మార్క్‌‌ను అధిగమించాడు. అయితే ఇదే సీజన్‌‌లో రెండుసార్లు అండర్సన్‌‌ను వెనక్కి నెట్టడం నీరజ్‌‌కు కలిసొచ్చే అంశం. దీనికితోడు ఈ ఏడాది తన అత్యుత్తమ పెర్ఫామెన్స్‌‌ (డైమండ్‌‌ లీగ్‌‌లో 89.94 మీటర్లు)తో జాతీయ రికార్డును నెలకొల్పాడు. అంతకుముందు టర్కీలో జరిగిన పావో నుర్మి గేమ్స్‌‌లోనూ 89.30 మీటర్ల మార్క్‌‌ను అందుకున్నాడు. ఇదే జోరును కొనసాగిస్తే  నీరజ్‌‌ కచ్చితంగా చాంపియన్‌‌గా నిలుస్తాడు. అండర్సన్‌‌ను పక్కనబెడితే.. జాకుబ్‌‌ వాద్లెచ్‌‌ (చెక్‌‌), జులియన్‌‌ వెబర్‌‌ (జర్మనీ), ఒలివర్‌‌ (ఫిన్లాండ్‌‌) నుంచి కూడా నీరజ్‌‌కు పోటీ ఎదురుకావొచ్చు. ఇక క్వాలిఫయింగ్‌‌లో రోహిత్‌‌ యాదవ్‌‌ కూడా 80.42 మీటర్లతో టాప్‌‌–11లో నిలిచాడు.