ఫేక్ ​RTPCR ​రిపోర్ట్​లు..  ల్యాబ్ ​టెక్నిషియన్ ​అరెస్ట్​

ఫేక్ ​RTPCR ​రిపోర్ట్​లు..  ల్యాబ్ ​టెక్నిషియన్ ​అరెస్ట్​

నేరేడ్​మెట్, వెలుగు: కొవిడ్​టెస్టులు చేయించినట్లు నటించి నకిలీ రిపోర్ట్​లను ఇచ్చిన ల్యాబ్​ టెక్నిషియన్​ను జవహర్​నగర్​పోలీసులు అరెస్ట్​ చేశారు. దమ్మాయిగూడలో సునీల్​కుమార్​అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నారు. సునీల్​కు ఆరేండ్లుగా నాచారం, హెచ్ఎంటీ నగర్​లో నివసిస్తూ ప్రైవేట్​ హాస్పిటల్ ల్యాబ్​లో పనిచేసే సేలి కిరణ్​ కుమార్(26)తో పరిచయం ఉంది. గత నెల సునీల్​తోపాటు అతని కుటుంబసభ్యులకు కొవిడ్​లక్షణాలు కనిపించాయి. దాంతో కిరణ్​కు కాల్​ చేసి చెప్పడంతో గత నెల 29న ఇంటికొచ్చి ఆర్టీపీసీఆర్​ టెస్ట్​ కోసం శాంపిల్స్​ తీసుకున్నాడు. మే 1న సునీల్​కు పాజిటివ్​ వచ్చిందని, మిగతావారికి నెగెటివ్​ వచ్చిందని క్యూఆర్​కోడ్​ ఉన్న పీడీఎఫ్​ ఫైల్​ను వాట్సప్​లో పంపించాడు. సునీల్​భార్యా పిల్లలకు మళ్లీ కరోనా సింప్టమ్స్​ కనిపించడంతో మరోసారి కిరణ్​కు ఫోన్​ చేశారు. 4న కిరణ్​వారి ఇంటికి వెళ్లి మరోసారి శాంపిల్స్​తీసుకున్నాడు. 7న సునీల్​భార్య, కూతురికి పాజిటివ్​ వచ్చిందని రిపోర్ట్​ పంపించాడు. మరుసటి రోజు నాగలక్ష్మి కడుపునొప్పితో బాధపడుతుండడంతో మళ్లీ కిరణ్​కు ఫోన్​ చేయడంతో ఇద్దరు డాక్టర్లను తీసుకువచ్చి ఆమె బ్లడ్​శాంపిల్​ తీసుకుని రూ. 7,500 తీసుకువెళ్లారు. హోం క్వారంటైన్​ ముగియడంతో ఈ నెల 23న మరోసారి అందరికీ ఆర్టీపీసీఆర్​ టెస్ట్​ను కిరణ్​తో చేయించారు. 25న నెగెటివ్​రిపోర్ట్​ని వాట్సప్​లో పంపించి టెస్ట్​కు రూ. వెయ్యి చొప్పున తీసుకున్నాడు. సునీల్​కు కిరణ్​ మీద అనుమానం రావడంతో ల్యాబ్​కు ఫోన్​చేశారు. దాంతో వారు కిరణ్​ఎవరో తమకు తెలీదని, తాము ఎలాంటి ఆర్టీపీసీఆర్​ టెస్ట్​లు చేయలేదని చెప్పారు. దాంతో కిరణ్​కు ఎన్నిసార్లు ఫోన్​చేసినా స్విచ్​ఆఫ్​రావడంతో గురువారం సాయంత్రం జవహర్​నగర్​పోలీసులకు సునీల్​కంప్లైంట్​చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ల్యాబ్​పాత రిపోర్ట్​లపై పేర్లు మార్చి మోసం చేసినట్లు కిరణ్​ఒప్పుకున్నాడు. కిరణ్ నుంచి ఒక ల్యాప్​టాప్, సెల్ ఫోన్, ప్రింటర్​, 7 నకిలీ ఆర్టీపీసీఆర్​రిపోర్ట్​లను సీజ్​చేసి శుక్రవారం రిమాండ్​కు తరలించినట్లు రాచకొండ సీపీ మహేష్​ భగవత్ చెప్పారు.