తెలంగాణ షిర్డీ ఎక్కడుందో తెలుసా..

తెలంగాణ షిర్డీ ఎక్కడుందో తెలుసా..

 హైదరాబాద్- నాగార్జున సాగర్ ప్రధాన రహదారి.. నిత్యం 24 గంటలు  వేలాది వాహనాల రాకపోకలతో బిజీగా ఉంది. వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే వాహనాలు. కాని  చింతపల్లికి రాగానే వాహనాలు స్లో అవుతాయి.  రోడ్డుపైనే ఒకటి .. రెండు నిమిషాలు ఆగాల్సిందే..  మరి చింతపల్లికి ఎందుకంత ప్రాధాన్యం ఉందంటారా.. హైవే పక్కన ఉన్న ఆలయం తెలంగాణ షిర్డీగా పేరు తెచ్చుకుంది.   కేవలం చింతపల్లి సాయిబాబా దర్శనం కోసమే హైదరాబాద్, గుంటూరు, మాచర్ల నుంచి భక్తులు వస్తారు.  చింతపల్లి సాయిబాబా గుడిపై ప్రత్యేక కథనం. . . 

సంతృప్తికి మించిన సంపద లేదంటారు సాయిబాబా. అందుకే కటిక నేలనే పాన్పుగా, ఇటుకనే తలగడగా చేసుకొని సాధారణ జీవితం గడిపాడు. శ్రద్ధ, శబరి అంటూ జ్ఞాన జోతులు వెలిగించారు. దాని ఫలితమే సాయిబాబా ఆలయాలు పల్లె పల్లెల్లో వెలుస్తున్నాయి. అలా ఏర్పడ్డ ఆలయమే.  నల్లగొండ జిల్లా చింతపల్లి సాయిబాబా ఆలయం.  ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే ఓం సాయి.. శ్రీసాయి... జయజయ సాయి ...సాయినామస్మరణ ప్రతిధ్వనిస్తుంటుంది. ప్రధాన ద్వారం పక్కనే ధుని గది ఉంటుంది. అక్కడ సాయినాథుడి ప్రతిమ భక్తులను ఆకట్టుకుంటుంది. సాయిబాబానే స్వయంగా వచ్చి ఇక్కడ కూర్చున్నాడా అనే భావన కలుగుతుంది. మెట్లపైనుంచి ప్రధాన మందిరం చేరుకోగానే.. నిర్మల రూపంతో సాయినాథుడు ఆకట్టుకుంటాడు. ఒక్కసారి సాయినాథుడి. . .పాదాలను తాకగానే.. షిర్డీలో ఉన్నామనే భావన కలుగుతుంది. వినాయకుడు, దత్తాత్రేయ, సరస్వతి దేవి విగ్రహాలు ఆకట్టుకుంటాయి. పచ్చని పరిసరాల్లో కల్యాణ మండపం, గోశాల, అన్నదాన క్షేత్రాలు ఉన్నాయి.

ప్రతిరోజు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ఈ ఆలయాన్ని భక్తుల సహకారంతో నిర్మించారు. రెండు కోట్ల వ్యయంతో రెండు ఎకరాల్లో 2007లో నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు వేలాది భక్తులతో కిటకిటలాడుతోంది ఈ గుడి. భక్తులు కొలిచే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఇక్కడి ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తాయి. పక్షుల కిలకిలరాగాలు, మయూరాల సందడి, జింకలు, కుందేళ్ల సంచారం కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. భక్తుల చింతలు తీరుస్తుండటంతో చింతపల్లి సాయినాథుడుగా పేరొచ్చింది.

 ప్రతి గురువారం ఒక జాతరనే తలపిస్తుంది ఈ ఆలయం. ఉదయం 8 గంటల నుంచే ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు తరలివచ్చి భజనలు చేస్తారు. కొంతమంది కళాకారులు గ్రూపుగా ఏర్పడి సాయి బాబా పాటలను ఆలపిస్తారు. భక్తులు ఆ పాటల జడిలో తన్మయత్వం పొందుతారు. ప్రత్యేక పూజలతో తరిస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు సాయిబాబా. అందుకే ప్రతి గురువారం భారీగా అన్నదానం చేస్తారు ఆలయ నిర్వాహకులు. అన్నదాన వితరణ కోసం భక్తులు విరాళాలు కూడా ఇస్తారు.

గోవులను దేవత రూపంగా భావిస్తారు. హిందువులు. అందుకే గోవులకు ఇక్కడ పూజలు చేస్తారు. గోవులకు ప్రాధాన్యం ఇచ్చిగోశాలను కూడా కట్టారు. సాయినాథుడిదర్శనం తర్వాత భక్తులు గోశాలను చూస్తారు. గోతాలలో కొద్దిసేపు గడిపి గోమాత ఆశీర్వాదం తీసుకుంటారు. గోశాల నిర్వహణ చూసిన భక్తులు 'మేం కూడా గోదానం చేస్తాం' అని ముందుకొస్తారు. అలా ఒకట్రెండు పశువులతో మొదలైన గోవులు వందల సంఖ్యకు చేరాయి. ఆలయం బయట, రహదారి పక్కన హోటల్ ఉంటుంది. పూజలు ఎంత పవిత్రంగా చేస్తారో, వంటల నిర్వహణలోనూ శుభ్రత పాటిస్తారు. భక్తులు కమ్మని రుచులను ఆస్వాదిస్తూ ఆ ప్రశాంత వాతావరణంలో సేద తీరుతారు...

సినిమా షూటింగ్స్​..

సాయిబాబా ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. పర్యాటక ప్రాంతం కూడా. కాలుష్యానికి దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంది. అందుకే టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఇక్కడ కొన్ని సీన్లు చిత్రించడానికి ఇష్టం చూపుతున్నారు.. రాఘవేందర్రావు దర్శకత్వం వహించిన 'షిర్డీ సాయి' పాటలు, కీలక సన్నివేశాలు ఇక్కడ చిత్రించినవే. ఇక్కడి సాయినాథుడు అచ్చం షిర్డీ సాయి విగ్రహంలా ఉంటుంది. డైరెక్టర్లు, నిర్మాతలు సెంటిమెంట్ గా భావించి ఒక్క సీన్ అయినా తెరకెక్కిస్తున్నారు.

ఎలా వెళ్లాలంటే...

హైదరాబాద్- నుంచి నాగార్జున సాగర్ వెళుతుంటే హైవేపై ఉన్న ఈ ఆలయం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో ఉంది. హైదరాబాద్ నుంచి దేవరకొండకు వెళ్లే బస్సులు చింతపల్లిలో ఆగుతాయి.