రాజ్‌కోట్‌ అగ్ని ప్రమాదం.. మృతుల్లో 9 మంది చిన్నారులు

రాజ్‌కోట్‌ అగ్ని ప్రమాదం.. మృతుల్లో 9 మంది చిన్నారులు

గుజరాత్‌: రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో శనివారం(మే 25) సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకూ 24 మంది మరణించారు. వీరిలో 9 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ఆసుపత్రికి పంపారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం కష్టంగా ఉందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వినాయక్ పటేల్ తెలిపారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు. తాత్కాలిక నిర్మాణం కూలిపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. ఈ ఘటనపై విచారణ నిమిత్తం టిఆర్‌పి గేమ్ జోన్ యజమాని, మేనేజర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు రాజ్‌కోట్ నగర పోలీసు కమిషనర్ రాజు భార్గవ తెలిపారు.

మోదీ విచారం 

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. "రాజ్‌కోట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ప్రియమైన వారిని కోల్పోయిన వారందరితో నా ఆలోచనలు ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షింస్తున్నా. స్థానిక యంత్రాంగం బాధితులుగా అన్ని విధాలుగా సహాయం అందించడానికి కృషి చేస్తోంది.." అని మోదీ ట్వీట్ చేశారు.

మృతుల కుటుంబాలకు 4 లక్షలు

ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు అందజేస్తామని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి సుభాష్ త్రివేది నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది.