డ్రగ్స్‌ పార్సిల్‌ చేస్తున్నారంటూ ... సైబర్‌ నేరగాళ్లు భారీగా మోసం

  డ్రగ్స్‌ పార్సిల్‌ చేస్తున్నారంటూ ... సైబర్‌ నేరగాళ్లు భారీగా మోసం

ఫెడెక్స్‌ కొరియర్‌లో డ్రగ్స్‌ పార్సిల్‌ చేస్తున్నారంటూ ఓ రిటైర్డ్‌ మహిళ ఉద్యోగిని సైబర్‌ నేరగాళ్లు భారీగా మోసం చేశారు. హైదరాబాద్ సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన ఓ రిటైర్డ్‌ మహిళ ఉద్యోగికి (62) సైబర్‌ నేరగాళ్ల నుంచి కాల్‌ వచ్చింది. ఫెడెక్స్‌ కొరియర్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని నమ్మబలికారు. కొరియర్‌ ద్వారా 960 గ్రాముల కొకైన్ తో పాటు 5 కిలోల బట్టలు, 7 నకిలీ పాస్‌పోర్ట్‌లు, 5 ఐసిఐసిఐ క్రెడిట్‌ కార్డ్‌లతో కూడిన పార్శిల్‌ ఉందని ... ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు తెలిపి ఫోన్ కట్ చేశారు. 

వెంటనే ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్‌ చేశారు. బాధితురాలిని భయపెట్టి తన బ్యాంక్‌ ఖాతాను వెరిఫై చేయాలంటూ వివిధ కారణాలు చెబుతూ రూ. 14,73,400 (పద్నాలుగు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందలు) కాజేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన బాధితురాలు వెంటనే గంట వ్యవధిలోనే (గోల్డెన్‌ అవర్‌లో) సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేసింది. 

అనంతరం నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు రూ.14,73,400లు ఫ్రీజ్‌ చేసి బాధితురాలికి అందజేశారు. ఫెడెక్స్‌ పేరుతో జరుగుతున్న మోసాలను నమ్మవద్దని, మోసపోయిన బాధితులు వెంటనే 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా వెంటనే సమస్య పరిష్కారం అవుతుందని ఏసీపీ సూచించారు.