
ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరిన్ని కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి కాల్ లిస్ట్ లో ఏపీ మంత్రుల ఫోన్ నంబర్లు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు జయరాం హత్య గురించి తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో సిరిసిల్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజిరెడ్డి, సినీ నటుడు సూర్యప్రసాద్, అతని మిత్రుడు కిషోర్ లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.
అంజిరెడ్డి, సూర్య, కిషోర్ నిందితులే
సూర్య, అంజిరెడ్డి, కిషోర్‌కు జయరాం హత్య గురించి తెలుసని, అయినా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో వీరిని అరెస్ట్ చేశామని చెప్పారు. సూర్య, కిషోర్ కలిసి జయరాంను విణా అనే అమ్మాయి పేరుతో హనీ ట్రాప్ చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాకేశ్ రెడ్డికి అంజిరెడ్డితో పరిచయం అయ్యిందని, ఓ ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం హత్య జరిగిన రోజు రాకేశ్ రెడ్డి ఇంటికి అంజిరెడ్డి వచ్చాడని డీసీపీ తెలిపారు. రాకేశ్ రెడ్డి ఇంట్లో జయరాం డెడ్ బాడీని చూసిన అంజిరెడ్డి భయపడి వెళ్లిపోయాడని, అదే సమయంలో జయరాం చేత రాకేశ్ రెడ్డి బలవంతంగా సంతకాలు తీసుకున్న డాక్యుమెంట్లను అంజిరెడ్డి తీసుకెళ్లాడని చెప్పారు. వీరు ముగ్గురికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నేరంలో పాత్ర ఉన్న కారణంగా అరెస్టు చేశామన్నారు. 15 రోజుల్లో కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామని డీసీపీ చెప్పారు. అయితే జయరాం హత్యతో తనకు, తన స్నేహితుడు కిషోర్ కు ఎలాంటి సంబంధం లేదని నటుడు సూర్యప్రసాద్ చెబుతున్నాడు. రాకేశ్ రెడ్డి ప్లాన్ ప్రకారమే ఈ కేసులో తమను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.