
కాకా వెంకటస్వామి వల్లనే కార్మికులకు పెన్షన్ ఫండ్ వచ్చిందని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మేడే సందర్భంగా INTUC ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి శ్రమశక్తి అవార్డుల ప్రధానోత్సం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేక్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు శ్రమశక్తి అవార్డులు ప్రధానం చేశారు. ట్యాంక్ బండ్ పై కాకా వెంకటస్వామి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
కార్మిక హక్కుల కోసం ఎంతో మంది కృషి చేశారని.. వారి కష్టాలకు గుర్తుగా కాక మెమోరియల్ గిల్డ్ అవార్డు ల ప్రధానం చేయడం జరుగుతూ వస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ అన్నారు. కాకా వెంకటస్వామి నిరంతరం కార్మికుల కోసం, వారి హక్కుల కోసం పోరాడారని గుర్తు చేశారు. కార్మికులకు గతంలో బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారని తెలిపారు.
ఏ కంపెనీ అయినా మంచి ఉత్పత్తి రావాలంటే కార్మికుల వల్లనే సాధ్యమని, అందుకే కార్మికుల సంక్షేమాన్ని బాగా చూసుకోవాలని కాకా వెంకటస్వామి చెప్పేవారని గుర్తు చేశారు. అదే బాటలో ఎంపీ వంశీ కృష్ణ కూడా రీసెంట్ గా పార్లమెంట్ లో కార్మికుల హక్కుల గురించి మాట్లాడారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ తక్కువగా వస్తుందని పార్లమెంట్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసువచ్చారని తెలిపారు. దీంతో 140 కోట్ల రూపాయల పెన్షన్ ఫండ్ సింగరేణి సంస్థ సాంక్షన్ చేసిందని ఈ సందర్భంగా తెలిపారు.
కాకా వెంకటస్వామి బాటలోనే సేవ చేస్తున్నాం: ఎమ్మెల్యే గడ్డం వినోద్
సింగరేణి సంస్థను 6 వందల కోట్ల రూపాయలతో కాపాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని అన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మంచి విద్యను అందించే అవకాశం తమ తండ్రి కాకా వెంకట స్వామి కల్పించారని ఈ సందర్భంగా అన్నారు. తాను, తన తమ్ముడు వివేక్ అదే బాటలో నడుస్తున్నామని చెప్పారు. మేడే సందర్భంగా కాకా వెంకట స్వామి ‘శ్రమ శక్తి అవార్డు’ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.
ఎమ్మెల్యే వివేక్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలి: కార్మిక సంఘనాయకులు
ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ వివేక్ వెంకటస్వామి ఉంటారుని, పేద ప్రజలను చారిటీ తో ఆదుకునే వ్యక్తి ఆయన అని ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు కొనియాడారు. మంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు అన్ని విధాలా అర్హత ఉన్న నాయకులు ఎమ్మెల్యే వివేక్ అని కార్మిక సంఘాల నాయకులు అన్నారు.
మాల, మాదిగ వర్గాల నుంచి మంత్రి వర్గంలో సరైన ప్రాతినిధ్యం లేదని, కాకా వెంకట స్వామి ఆశయాలను ముందుకు తీసుకుపోతున్న వివేక్ వెంకట స్వామి కి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవి ఇవ్వకపోతే పోరాటానికి సిద్ధం అని హెచ్చరించారు.