- బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోవడమే కారణం
ఎల్బీనగర్, వెలుగు: హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్సనల్గన్ మ్యాన్ ఆదివారం ఉదయం తన ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఖమ్మం జిల్లా రావిపాడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి కృష్ణచైతన్య 2020 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ మునగనూర్ పరిధిలోని సాయిసూర్యనగర్ కాలనీ రోడ్ నంబర్ 3లో తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వ్యక్తిగత భద్రతా అధికారిగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం కృష్ణచైతన్య తన ఇంట్లో సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తల వెనుక భాగంలో కాల్చుకోవడంతో పుర్రెకు, మెదడుకు తీవ్రమైన పగుళ్లు ఉన్నట్లు సీటీ స్కాన్ లో డాక్టర్లు గుర్తించారు.
హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణచైతన్య ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్.. దవాఖానకు చేరుకుని, ఆయన పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని రంగనాథ్ తెలిపారు.
