కోల్‌కతా: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)ను రాజకీయ కోణంలో చూడటం చాలా పెద్ద తప్పని సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఆర్ఎస్‌ఎస్‌ను బీజేపీతో ముడిపెట్టి పోల్చడం, పొలిటికల్ యాంగిల్‌లో చూస్తుండటంతో ప్రజల్లో తరచుగా అపార్థాలు తలెత్తుతున్నాయని అన్నారు.
ఆదివారం కోల్‌కతాలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగవత్ పాల్గొని మాట్లాడారు. ‘‘చాలామంది సంఘ్‌ను బీజేపీ దృక్పథంలో అర్థం చేసుకునే ధోరణి కొనసాగుతోంది. అది చాలాపెద్ద తప్పు” అని అన్నారు.
సంఘ్‌కు సంబంధించిన అనేక అపోహలను కూడా ఆయన ఖండించారు. నైతిక దృఢత్వం, సామాజిక నిబద్ధత కలిగిన స్వయంసేవకులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజంతోపాటు బలమైన దేశ నిర్మాణానికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తోందని చెప్పారు.
సజ్జనులను తయారు చేయడమే సంఘ్ ముఖ్య లక్ష్యమని అన్నారు. నిస్వార్థ సేవ, విలువలతో కూడిన జీవన విధానం ఆరోగ్యకరమైన దేశ అభివృద్ధిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
