సోనియా గాంధీని ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదు : జగ్గారెడ్డి

సోనియా గాంధీని ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదు : జగ్గారెడ్డి
  • మోదీ హామీలపై ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదు?
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టో అమలు గురించి ఏనాడైనా తెలుసుకున్నారా..? అని ప్రశ్నిస్తూ సోనియా గాంధీకి లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్‌‌ రెడ్డిపై పీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ జగ్గారెడ్డి ఫైర్‌‌‌‌ అయ్యారు. సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. దమ్ముంటే ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌‌ హామీల అమలుపై చర్చకు రావాలని సవాల్‌‌ చేశారు. ఆదివారం గాంధీ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సోనియాకు లేఖ రాసిన కిషన్ రెడ్డి.. మోదీ ఇచ్చిన హామీలపై ఎందుకు లేఖ రాయడం లేదని నిలదీశారు. కిషన్ రెడ్డి రాసిన లేఖకు ఎలాంటి వాల్యూ లేదని కొట్టిపారేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి, దేశంలోని పేదలందరికీ రూ.15 లక్షల చొప్పున ఇస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. 

ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని మోదీ గాలికి వదిలేశారని విమర్శించారు. 11 ఏండ్లు గడిచినా మోదీ ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామన్న మోదీ.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోదీ జీరో అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సోనియా, రాహుల్ నాయకత్వంలో ఇచ్చిన 13 హామీల్లో.. రెండేండ్లలోనే 70 శాతం హామీలు అమలు చేశామని తెలిపారు.