- కార్యకర్తలను వేధించేందుకే కాంగ్రెస్ కుట్ర: రాంచందర్ రావు
- సనాతన ధర్మాన్ని తిట్టేటోళ్లకుఆ బిల్లు రక్షణ కవచం
- కేసీఆర్‌ది ఓటీపీ పాలిటిక్స్..బీఆర్ఎస్ పని ఖతమన్న బీజేపీ స్టేట్ చీఫ్
హైదరాబాద్, వెలుగు: కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హేట్ స్పీచ్ బిల్లు–2025 తరహాలోనే తెలంగాణలోనూ చట్టం తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. హిందువుల నోరు నొక్కేందుకే ఈ చట్టాన్ని తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను వేధించడానికి, వాళ్లను మాట్లాడకుండా చేసేందుకే ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాజకీయం ‘వన్ టైం పాలిటిక్స్(ఓటీపీ)’ లాంటిదని, ఆయన బయటకు వచ్చినంత మాత్రాన రాష్ట్రంలో రాజకీయాలు మారవన్నారు.
ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో రాంచందర్ రావు మాట్లాడారు. ‘ముస్లిం ఈజ్ కాంగ్రెస్.. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అని చెప్పింది కాంగ్రెస్ నాయకులు కాదా?’ అని ప్రశ్నించారు. హేట్ స్పీచ్ ఇచ్చింది, సనాతన ధర్మంపై అసభ్యంగా మాట్లాడింది కాంగ్రెస్, ఇండియా కూటమేనని అన్నారు. హిందూత్వంపై విద్వేషాన్ని పుట్టించిందే కాంగ్రెస్ అని.. ఇప్పుడు వారే హేట్ స్పీచ్ చట్టం తెస్తామనడం సిగ్గుచేటన్నారు. హిందువులను, హిందూ దేవతలను, సనాతన ధర్మాన్ని తిట్టేవాళ్లకు రక్షణ కల్పించేందుకే కాంగ్రెస్ ఈ చట్టాన్ని ఆయుధంగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ‘‘కేసీఆర్ బయటకు వచ్చారు.. తెలంగాణలో రాజకీయాలు మారుతాయని బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారు. కానీ, ఆయన కొన్నాళ్లు ఉంటారు.. మళ్లీ వెళ్లిపోతారు. ఆయనది కేవలం ఓటీపీ పాలిటిక్స్’’ అని విమర్శించారు.
