- అయోధ్యపురం భూనిర్వాసితుల డిమాండ్
- తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
హనుమకొండ, వెలుగు: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో భూనిర్వాసితులు, స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని, దీనికోసం ప్రత్యేక జీవో తీసుకురావాలని వక్తలు డిమాండ్ చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ తో కాజీపేట మండలం అయోధ్యపురంలో ఆదివారం తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ రాఘవేందర్ మాట్లాడుతూ రాష్ట్రానికి మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట మండలం అయోధ్యపురంలో ఏర్పాటు చేశారన్నారు.
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అయోధ్యపురం రైతులు భూములు ఇచ్చారని, తమ పిల్లలతో పాటు స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని ఆశపడ్డారని తెలిపారు. కానీ, ఫ్యాక్టరీలో ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
కపుర్తలా, రాయిబరేలిలో మాదిరిగా ప్రత్యేక జీవో తెచ్చి, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూనిర్వాసితులతో పాటు ఇక్కడి యువతకు పర్మినెంట్ ఉద్యోగాలు వచ్చేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తరువాత కూడా స్థానికేతరులకే ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నాలు జరగడం బాధాకరమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ గుడిమల్ల రవికుమార్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్ పాల్గొన్నారు.
