తెలంగాణ వచ్చినా ఏమీ మారలే : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 తెలంగాణ వచ్చినా ఏమీ మారలే : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
  • పదేళ్ల బీఆర్ఎస్​ హయాంలో ఒక్క గ్రూప్​ పరీక్ష నిర్వహించలేదని ఫైర్

గద్వాల, అలంపూర్/అయిజ/శాంతినగర్, వెలుగు: తెలంగాణ వస్తే ఏదో జరుగుతుందని ప్రజలు భావించినా ఏమీ మారలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్  మండలం గూడెందొడ్డి గ్రామంలో బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వస్తే ప్రజల రాతలు మారతాయని అనుకున్నా ఏమీ మారలేదని, కేవలం పెన్షన్లు తప్ప ఇప్పటి వరకు ఇండ్లు కూడా రాలేదన్నారు. నిరుద్యోగులకు జాబ్​లు రాలేదని, పదేళ్ల బీఆర్ఎస్  పాలనలో ఒక్క ఎగ్జామ్​ కూడా నిర్వహించలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక కూడా మార్పు కనిపించడం లేదన్నారు. గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో? ఎవరికి తెలియని పరిస్థితి ఉందన్నారు. పరిస్థితులు మారాలంటే పాలకులు మారాలని, ఒకే కుటుంబానికి చెందిన వారిని రాజకీయంగా దూరంగా నెట్టివేయాలని పిలుపునిచ్చారు. 

అంతకుముందు బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అలంపూర్ లోని100 పడకల ఆసుపత్రిని పరిశీలించారు. మానవపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ను పరిశీలించారు. రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్  ఫ్యాక్టరీతో నష్టపోయే రైతులతో మీటింగ్  నిర్వహించారు.  తెలంగాణ వచ్చి 12 ఏండ్లు గడిచినా, ఆర్డీఎస్ లో పూర్తి స్థాయి నీటిని వాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

 ప్రభుత్వానికి ఆరు నెలలు గడువు ఇస్తామని, ఆ తర్వాత ఆర్డీఎస్  నుంచి పోరుబాట ప్రారంభించి, పాదయాత్ర చేస్తామని తెలిపారు. ఆర్డీఎస్  నుంచి 16 టీఎంసీల నీటిని వినియోగించుకొనే అవకాశం ఉన్నా పదేళ్లు బీఆర్ఎస్, రెండేళ్లు కాంగ్రెస్  ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు ఫైట్  చేస్తానని తెలిపారు. గుండ్రేవుల ప్రాజెక్టు రద్దయ్యేంత వరకు పోరాటం చేస్తామన్నారు. సీడ్  పత్తి రైతుల సమస్యను రైతు కమిషన్  దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.