బీహార్ రాజకీయాల్లో సంచలనం: ఎన్నికల వేళ నలుగురు మాజీ ఎమ్మెల్యేలు సహా 11 మందిపై నితీష్ వేటు

బీహార్ రాజకీయాల్లో సంచలనం: ఎన్నికల వేళ నలుగురు మాజీ ఎమ్మెల్యేలు సహా 11 మందిపై నితీష్ వేటు

పాట్నా: మరో 10 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై నలుగురు నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు సహా 11 మంది కీలక నేతలపై నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార జేడీయూ పార్టీ వేటు వేసింది. బహిష్కరణకు గురైన నేతలు జేడీయూ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని పార్టీ పేర్కొంది. 

-కొందరు పార్టీ సిద్ధాంతం, క్రమశిక్షణకు విరుద్ధంగా స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వెల్లడించింది. కాగా, బీహార్ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరుకుంది. నామినేషన్ల పర్వం ముగియడంతో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అసెంబ్లీ ఎన్నికల దంగల్‎ను రక్తికటిస్తున్నాయి. విమర్శలకు ప్రతి విమర్శలు, కౌంటర్లకు రీ కౌంటర్లతో రాజకీయ రణరంగాన్ని వేడెకిస్తున్నాయి.

ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు సహా 11 మంది కీలక నేతలపై అధికార జేడీయూ పార్టీ వేటు వేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. కాగా, మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి 2025, నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

పార్టీ నుంచి బహిష్కరణకు గురైన 11 మంది నేతలు వీరే:

  • మాజీ మంత్రి శైలేష్ కుమార్
  • మాజీ ఎమ్మెల్సీ సంజయ్ ప్రసాద్
  • మాజీ ఎమ్మెల్యే శ్యామ్ బహదూర్ సింగ్
  • మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ కుమార్
  • మాజీ ఎమ్మెల్సీ రణ్‌విజయ్ సింగ్
  • మాజీ ఎమ్మెల్సీ అమర్ కుమార్ సింగ్
  • మాజీ ఎమ్మెల్సీ అస్మా పర్వీన్
  • మాజీ ఎమ్మెల్సీ లవ్ కుమార్
  • మాజీ ఎమ్మెల్సీ ఆశా సుమన్
  • మాజీ ఎమ్మెల్సీ దివ్యాంశు భరద్వాజ్
  • మాజీ ఎమ్మెల్సీ వివేక్ శుక్లా