ప్రపంచ దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న వేళ.. భారత్ శక్తిసామర్థ్యాలపై అంతర్జాతీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించగల సత్తా కేవలం భారత ప్రధాని మోడీకి మాత్రమే ఉందని UAE రాయబారి సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రధాని మోడీ నుంచి ఇటు ఇజ్రాయెల్‌కు, అటు ఇరాన్‌కు వెళ్లే ఒక్క ఫోన్ కాల్ ఈ మొత్తం సమస్యను పరిష్కరించగలదు" అని ఆయన పేర్కొనడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
పశ్చిమాసియాలో ముదురుతున్న సంక్షోభంపై స్పందించిన యూఏఈ రాయబారి, భారత్‌కు ఉన్న వ్యూహాత్మక సంబంధాలను కొనియాడారు. ఇజ్రాయెల్‌తో భారత్‌కు అత్యున్నత స్థాయి రక్షణ, వాణిజ్య బంధం ఉండగా.. ఇరాన్‌తో చారిత్రక, క్రూడ్ సంబంధిత సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాలతోనూ సమానమైన మైత్రిని కొనసాగిస్తున్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటి. అందుకే ప్రధాని మోడీ జోక్యం చేసుకుంటే ఇరు దేశాలు చర్చల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని యూఏఈ విశ్వసిస్తోంది.
గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా "ఇది యుద్ధాల యుగం కాదు" అని మోడీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందాయి. అదే తరహాలో ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న గొడవను ఆపడానికి మోడీ దౌత్యం కీలకం కానుంది. కేవలం మాటలతోనే కాకుండా.. చేతలతో కూడా శాంతిని స్థాపించగల నాయకుడిగా మోడీని గల్ఫ్ దేశాలు చూస్తున్నాయి. ఈ సంక్షోభం గనుక ముదిరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, దానిని అడ్డుకునే శక్తి భారత్‌కు ఉందని రాయబారి అభిప్రాయపడ్డారు.
సాధారణంగా ఇలాంటి వివాదాల్లో అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుంది. కానీ, అమెరికాకు ఇరాన్‌తో సత్సంబంధాలు లేవు. అందుకే రెండు దేశాలను ఒకే వేదికపైకి తీసుకురాగల ఏకైక దేశం భారత్ మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. యూఏఈ రాయబారి చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత్ పెరిగిన పరపతిని స్పష్టం చేస్తున్నాయి. మోడీ గనుక చొరవ తీసుకుంటే పశ్చిమాసియాలో శాంతి నెలకొనడమే కాకుండా.. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల నుంచి ప్రపంచానికి విముక్తి లభిస్తుంది. మరోపక్క యూఏఈ ఈ వివాదంలో ఎందుకు చిక్కుకుందో అర్థం కావటం లేదని, తమకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని అన్నారు భారత్ లోని మొదటి UAE రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా.
