హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న అత్యుత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేసేందుకు మన టీచర్లను జపాన్, ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం దేశాలకు పంపాలని నిర్ణయించింది. ‘టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్’లో భాగంగా రాష్ట్రం నుంచి 40 మంది ప్రతినిధుల బృందం జపాన్ పర్యటనకు వెళ్లనుంది. దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
29 మందితో తొలి జాబితా..
ఈ పర్యటన కోసం ప్రాథమికంగా 29 మందితో కూడిన హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల జాబితాను ఖరారు చేసింది. వీరితోపాటు 11 మంది అధికారులు ఉంటారు. వీరు సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు జపాన్ లో పర్యటించి అక్కడి స్కూళ్ల నిర్వహణ, బోధనా విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఎంపికైన ప్రతినిధులకు వీసా ప్రాసెసింగ్, ఇతర నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 18న మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ ఓరియంటేషన్ నిర్వహించనున్నారు.
ఎంపికైన వారు వీరే...
తల్లూరి సాయి ఈశ్వరి (సూర్యాపేట), గోల్డీ బల్బీర్ కౌర్ (పెద్దపల్లి), టి.సునీత (నారాయణపేట), నిమ్మకూరి సంధ్యశ్రీ (సిద్ధిపేట), అడపాల వాణి(నల్గొండ), ఎస్.పద్మ (నిర్మల్), వి.గోవర్ధన్ (రంగారెడ్డి), ఏ. శ్రీనివాస్ (హన్మకొండ), కె.మల్లయ్య (ములుగు), కోట్ల భాస్కర్ రెడ్డి (నాగర్ కర్నూల్), మారం పవిత్ర(సూర్యాపేట), ఎం.రజిత (మెదక్), బి.రూప (నారాయణపేట), గుడూరి ఇందిర(కామారెడ్డి), హదియాబేగం (ఆసిఫాబాద్), ఫరీదా తస్నీమ్ (నిర్మల్), జాడి శ్రీనివాస్ (నిర్మల్), అమరవాజు లక్ష్మీనాథం (నిజామాబాద్), సి.కృష్ణారెడ్డి (వికారాబాద్), పి.ప్రవీణ్ కుమార్ (కామారెడ్డి), కల్వకుంట్ల శ్రీలత (కరీంనగర్), వి.మంజుల (సిద్దిపేట), ఎన్.వనజ (నిర్మల్), మల్లా మోహన కుమార్ (కొత్తగూడెం), చారుగుండ్ల రాజశేఖర్ (సూర్యాపేట), కుందూరు సుధాకర్ (జనగామ), పెనుగొండ ప్రవీణ్ కుమార్ (మహబూబాబాద్), పి. మురళీకృష్ణ (వనపర్తి), బి.కుమార స్వామి (వరంగల్) ఎంపికయ్యారు.
