ఒకే వ్యక్తి.. వేర్వేరు పేర్లతో పాస్పోర్టులు..యూఎస్ కాన్సులేట్ అధికారుల ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్

ఒకే వ్యక్తి.. వేర్వేరు పేర్లతో పాస్పోర్టులు..యూఎస్ కాన్సులేట్ అధికారుల ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: ఒకే వ్యక్తి వేర్వేరు పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు పెట్టి, పాస్​పోర్టులు తీసుకుని, విదేశాలకు తిరిగిన ఉదంతం గచ్చిబౌలి పరిధిలో వెలుగు చూసింది. కోకాపేటకు చెందిన మోతుకుపల్లి లక్ష్మీకాంత్​రెడ్డి(55) 1997లో మేధ ప్రసూన్​కుమార్​రెడ్డి పేరుతో, ఆ తర్వాత ముద్దనోళ్ల లక్ష్మీకాంత్​ పేరుతో నకిలీ బర్త్​, రెసిడెన్షియల్ సర్టిఫికెట్లతో వేర్వేరు పాస్​పోర్టులు పొందాడని పోలీసులు తేల్చారు. 

2017లో అసలు పేరుతోనూ పాస్​పోర్టు తీసుకుని అమెరికా వెళ్లొచ్చిన నిందితుడు, ఈ ఏడాది మళ్లీ వీసా కోసం గచ్చిబౌలిలోని యూఎస్​ కాన్సులేట్​లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఒకే వ్యక్తి వేర్వేరు పేర్లతో పాస్​పోర్టులు కలిగి ఉన్నట్లు యూఎస్​కాన్సులేట్​అధికారులు గుర్తించి, గత మార్చి 22న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్​చేసి, అతని వద్ద నుంచి సెల్​ఫోన్, ఐప్యాడ్​, పాస్​పోర్టు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ పాస్​పోర్టుల జారీ వెనుక సహకరించిన బ్రోకర్ల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.