భాగ్యలక్ష్మి ఆలయం వద్ద లక్షల మందితో వందేమాతరం దమ్ముంటే ఎంఐఎం అడ్డుకోవాలి : బండి సంజయ్

భాగ్యలక్ష్మి ఆలయం వద్ద లక్షల మందితో వందేమాతరం దమ్ముంటే ఎంఐఎం అడ్డుకోవాలి : బండి సంజయ్
  •     జాతీయ గేయాన్ని అవమానిస్తే మూడేండ్ల జైలు తప్పదు: బండి సంజయ్
  •     రేషన్​ కార్డులపై మోదీ ఫొటో పెట్టరా అని ప్రశ్న ?

హైదరాబాద్, వెలుగు: పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద లక్షలాది మందితో వందేమాతరం గేయాలాపన నిర్వహిస్తామని, ఎంఐఎం నేతలకు దమ్ముంటే అడ్డుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. వందేమాతరాన్ని అవమానించేవారికి మూడేళ్ల జైలు, జరిమానా తప్పదని హెచ్చరించారు. చెవుల్లో దూది పెట్టుకున్నా వినిపించేలా వందేమాతరం గేయాన్ని ఆలపిస్తామని వ్యాఖ్యానించారు. 

గతంలో అసెంబ్లీలో వందేమాతర ఆలాపనను ఎంఐఎం బహిష్కరిస్తే.. కాంగ్రెస్ ఆ పార్టీకి వత్తాసు పలికిందని ఆరోపించారు. రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టరని సంజయ్ ప్రశ్నించారు. ‘కేంద్రం ఉచితంగా అందిస్తున్న బియ్యంతో రాష్ట్రంలోని 57 లక్షల కార్డుదారులకు ప్రయోజనం కలుగుతోంది. బియ్యం మోదీ ప్రభుత్వం ఇస్తుంటే.. కార్డులపై సీఎం, మంత్రుల ఫొటోలు వేసుకోవడమేంది’ అని విమర్శించారు. కేంద్రం ఇచ్చే బియ్యం అవసరం లేదని చెప్పే దమ్ము కాంగ్రెస్ సర్కార్‌‌కు ఉందా అని నిలదీశారు.

22 ఏ పేరుతో భూముల దోపిడీ..

రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితా పేరుతో భారీ భూ దోపిడీ జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. ఏనుగులు మింగేటోడు (బీఆర్ఎస్) పోయి.. పీనుగులు మింగేటోడు (కాంగ్రెస్) వచ్చాడనీ, రాష్ట్రంలో 95 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో ఎలా పెడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం 2.77 కోట్ల ఎకరాల భూమి ఉంటే, ఏకంగా 95 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో ఎలా పెడతారని ప్రశ్నించారు. ప్రభుత్వం విక్రయించిన భూములు హెచ్‌‌ఎండీఏ వేలం వేసిన భూములు, ప్రజలు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన భూములు, పరిశ్రమలకు విక్రయించిన భూములను సైతం 22ఏ జాబితాలో చేర్చారని ఆరోపించారు. 21 ఏళ్లకే చట్టసభల్లోకి వచ్చే అవకాశం కల్పిస్తామంటున్న కాంగ్రెస్.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే జెన్-జీకి మంత్రి పదవులు, ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.