బెంగళూరు: పాకిస్తాన్ ఆర్మీపై దాడికి కుట్ర పన్నిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత తెహ్రీక్ -ఈ -తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) సభ్యుడితో కలిసి దాడికి ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అసాఫుల్ మాలిక్ బిన్ అబెద్ మాలిక్‌గా గుర్తించారు. ఆగస్టు 11న బెంగళూరులోని బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియాలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మాలిక్ జిగణిలో నివసిస్తున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ అణచివేత చర్యలపై మాలిక్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు విచారణలో తేలింది. ఇజ్రాయెల్ -పాలస్తీనా వివాదంలో పాకిస్తాన్ ఆర్మీ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తోందని అతడు ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న టీటీపీ సభ్యుడు ఇమ్రాన్ అహిందర్‌తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నట్లు గుర్తించారు. పాక్ ఆర్మీపై ప్రతీకారం తీర్చుకునేందుకు అతడి సాయం కోరినట్లు పోలీసులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ వెళ్లేందుకు మాలిక్ పాస్‌పోర్ట్ తీసుకోవడంతో పాటు వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అతడు అక్కడికి వెళ్లలేదని పోలీసులు చెప్పారు. మాలిక్ మొబైల్ ఫోన్‌లో దాడికి సంబంధించిన సందేశాలు, ఆడియో రికార్డింగ్స్‌ను గుర్తించారు. దీంతో హెబ్బగోడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
