
హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. అర్ధరాత్రి రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతూ.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కుత్భుల్లాపూర్ జీడిమెట్లలో అనుకోని సంఘటన జరిగింది.
జీడిమెట్ల అయోధ్యనగర్ చౌరస్తాలో కొంతమంది యువకులు గంజాయి తాగుతున్నారని సమాచారంతో యువకులపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులమంటూ దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకోబోయిన అభం శుభం తెలియని చంటీ యాదవ్(21) అనే యువకుడిపై సర్జికల్ బ్లెడ్ తో అధికారులు దాడి చేశారు. ఈ ఘటనలో చెంప,చెవి,తలకు తీవ్రగాయాలయ్యాయి. దగ్గరలోని అజుదా ఆస్పత్రికి తరలించగా మొత్తం 22 కుట్లు పడ్డాయి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఎక్సైజ్ అధికారులు, బాధితులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువురి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.