V6 News

టామ్ కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు.. జర్మనీలో ప్రతి ఏటా 5 లక్షల జాబ్ వేకెన్సీలు: మంత్రి వివేక్

టామ్ కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు.. జర్మనీలో ప్రతి ఏటా 5 లక్షల జాబ్ వేకెన్సీలు:  మంత్రి వివేక్
  • ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి
  • 118 ఏటీసీల ద్వారా ఏటా 25 వేల మందికి స్కిల్ డెవలప్​మెంట్ ట్రైనింగ్​
  • జర్మనీలో ప్రతి ఏటా 5 లక్షల జాబ్​ వేకెన్సీలు ఉన్నాయి
  • ఏడాదికి 90 వేల వీసాలు జారీ చేసేందుకు ఆ దేశం ముందుకొచ్చింది
  • టామ్​కామ్​ ద్వారా నాలుగు నెలల్లో జర్మన్​ లాంగ్వేజ్​ నేర్పిస్తం
  • యువత ప్రైవేట్​ రిక్రూట్​మెంట్ ఏజెన్సీల మాయలో పడొద్దని సూచన

మంచిర్యాల, వెలుగు: తెలంగాణ ఓవర్సీస్​ మ్యాన్​ పవర్​ కంపెనీ లిమిటెడ్ (టామ్​కామ్) ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్​శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. బుధవారం (ఏప్రిల్ 15) మంచిర్యాలలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పటికే 70 వేల జాబ్స్ ఇచ్చారని వెల్లడించారు. నిరుద్యోగ యువతకు విదేశాల్లో మెరుగైన ఉద్యోగాలు కల్పించేందుకు టామ్​కామ్​కు ఈ బడ్జెట్​లో రూ.90 కోట్లు కేటాయించారన్నారు. 

ఇండస్ట్రీస్​ అవసరాల మేరకు స్కిల్డ్​ మ్యాన్​ఫోర్స్​ను సప్లై చేసేందుకు ఇప్పటికే 65 అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీల) ద్వారా స్కిల్​ డెవలప్​మెంట్​ ట్రైనింగ్​ అందిస్తున్నదని మంత్రి వివేక చెప్పారు. రాష్ట్రంలో మరో 53 ఏటీసీల ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్)తో అగ్రిమెంట్​ చేసుకున్నట్లు చెప్పారు. తద్వారా ఏటా 25 వేల మందికి వివిధ కోర్సుల్లో ట్రైనింగ్​ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. ఏటీసీల్లో ట్రైనింగ్​ తీసుకుంటున్న వారికి జూన్​ నుంచి నెలకు రూ.2 వేల స్టైఫండ్​ అందిస్తామన్నారు. 

  • జర్మనీలో ఏటా 5 లక్షల జాబ్స్

జర్మనీలో హాస్పిటల్స్, హోటల్స్, కన్​స్ట్రక్షన్, ట్రాన్స్​పోర్ట్, నర్సింగ్, ఫార్మా, ఇండస్ట్రీస్​ తదితర రంగాల్లో ఏటా 5 లక్షల ఉద్యోగాల భర్తీకి అవకాశాలు ఉన్నాయని మంత్రి వివేక్​ తెలిపారు. ప్రతి సంవత్సరం 90 వేల వీసాలు జారీ చేసేందుకు జర్మనీ ముందుకొచ్చిందని వెల్లడించారు. యువతకు ఏటీసీల ద్వారా స్కిల్​ డెవలప్​మెంట్​తో పాటు టామ్​కామ్ ద్వారా నాలుగు నెలల్లో జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తామన్నారు. జపాన్​లో నర్సింగ్​కు మంచి డిమాండ్​ ఉందన్నారు. వారికి నెలకు రూ.2 లక్షలకు పైగా వేతనాలు లభిస్తాయని తెలిపారు. ఇండియా నుంచి వచ్చేవారు విదేశీ చట్టాలను, అక్కడి కల్చర్​ను గౌరవిస్తూ కష్టపడి పనిచేస్తారనే పేరు ఉందన్నారు. వివిధ దేశాల కంపెనీలు భారతీయులను నియమించుకునేందుకు మొగ్గుచూపుతున్నాయని మంత్రి వివరించారు నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 


కోల్​బెల్ట్, వెలుగు: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జర్మనీ ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్​ ఎంవోయూ కుదుర్చుకున్నదని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక, రిక్రూట్​మెంట్, జర్మన్ లాంగ్వేజీలో శిక్షణ  ఇప్పించేందుకు మందమర్రిలోని సింగరేణి స్కిల్​ డెవలప్​మెంట్ సెంటర్​లో టామ్​కామ్​ మోడల్​ సెంటర్​ను త్వరలో ప్రారంభిస్తామన్నారు.

 బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలు, మందమర్రి మండలం చిర్రకుంటలో మంత్రి వివేక్​ పర్యటించారు. మందమర్రిలోని ఏటీసీ సెంటర్​ను కలెక్టర్​ కుమార్​ దీపక్, అడిషనల్​ కలెక్టర్​ పి.చంద్రయ్య, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, ఐటీఐ ప్రిన్సిపల్​ దేవానంద్​తో కలిసి మంత్రి సందర్శించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. వారికి టామ్​కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.  

  • చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు 

చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వివేక్ చెప్పారు. మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై మందమర్రిలో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మున్సిపాలిటీలను శుభ్రంగా ఉంచాలన్నారు. మందమర్రిలో రూ.20 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. 

మందమర్రి, క్యాతనపల్లి ప్రజలకు సౌకర్యంగా ఉండేలా మందమర్రి నుంచి మంచిర్యాలకు ఆర్టీసీ బస్సు ప్రారంభించామని, త్వరలో చెన్నూరులో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమీక్షలో మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూర్ మున్సిపాలిటీల కమిషనర్లు తుంగపిండి రాజలింగు, మారుతి ప్రసాద్, మురళీకృష్ణ, సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్​.రాధాకృష్ణ పాల్గొన్నారు.

  • ప్రైవేట్​ ఏజెన్సీ మాయలో పడొద్దు

యువత ప్రైవేట్​ జాబ్​ రిక్రూట్​మెంట్​ ఏజెన్సీల మాయలో పడవద్దని వివేక్​ సూచించారు. కొంతమంది విదేశాల్లో జాబ్స్​ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర రెండు మూడు లక్షలు వసూలు చేసి మోసం చేస్తున్నారన్నారు. విదేశాలకు వెళ్లాలనే ఆసక్తి ఉన్నవారు టామ్​కామ్​లో రిజిస్ట్రేషన్​ చేసుకుంటే వారి స్కిల్స్​కు తగిన ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు. 

టామ్​కామ్​ను మరింత విశ్వసనీయమైన సంస్థగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని వివరించారు. తెలంగాణ గిగ్ వర్కర్స్ యాక్ట్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసంఘటితరంగ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివేక్​ పేర్కొన్నారు.