అంబానీ, జాక్ మాలను వెనక్కినెట్టిన జాంగ్ శాంసాన్
న్యూఢిల్లీ: ఆసియాలోని ధనవంతుల లిస్ట్‌లో ముకేశ్ అంబానీ, జాక్ మాలను దాటి నెంబర్ స్థానానాకి చైనీస్ బిలినియర్ జాంగ్ శాంసాన్(66) చేరుకున్నారు. జర్నలిజంలో కెరీర్‌ను స్టార్ట్ చేసిన జాంగ్, ప్రస్తుతం మస్రూమ్ ఫార్మింగ్, హెల్త్ కేర్ సెక్టార్‌లలో బిజినెస్ చేస్తున్నారు. 2020 లో ఆయన కంపెనీలు నోంగ్ఫూ, వాంటాయ్‌లు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యాయి. ఈ కంపెనీల షేర్లు లిస్టింగ్ నుంచి ఇప్పటి వరకు 2000 శాతం వరకు పెరగడం గమనార్హం. ఈ ఏడాది జాంగ్ సంపద 70.9 బిలియన్ డాలర్ల నుంచి 77.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో ప్రపంచంలోని ధనవంతుల్లో 11 వ స్థానానికి ఆయన చేరుకున్నారు. మీడియాకు దూరంగా ఉండే జాంగ్‌ను చైనాకు వెలుపల చాలా తక్కువమంది గుర్తుపడతారు. హిస్టరీలోనే అత్యంత వేగంగా జాంగ్ సంపద క్రియేట్ చేశాడని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. సొంతంగా ఎదిగిన జాంగ్‌ను చైనాలో ‘లోన్ వోల్ఫ్(ఒంటరి తోడేలు)’ గా పిలుస్తుంటారు.
కరోనా వ్యాక్సిన్ తయారీలో వాంటాయ్..
జాంగ్ కంపెనీ వాంటాయ్ బయోలాజికల్ ఫార్మాసీ 2020 ఏప్రిల్‌లో మార్కెట్‌లో లిస్టింగ్ అయ్యింది. కొన్ని నెలలకే వాటర్ బాటిల్స్mukను తయారు చేసే నోంగ్ఫూ స్ప్రింగ్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యింది. లిస్టింగ్ నుంచి చూస్తే వాంటాయ్ షేర్లు 2,000 శాతం పెరగగా, నోంగ్ఫూ షేర్లు 155 శాతం లాభపడ్డాయి. నోంగ్ఫూ బిజినెస్ బాగుందని, మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని తాజాగా సిటీ గ్రూప్ పేర్కొంది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత కంపెనీ షేర్లు విపరీతంగా పెరిగాయి. ఈ వారం నోంగ్ఫూ షేరు ఆల్‌టైమ్ హైని టచ్ చేసింది కూడా. మరోవైపు జాంగ్ వాంటాయ్ కంపెనీ కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ సంపద కూడా ఈ ఏడాది విపరీతంగా పెరిగింది. గూగుల్, ఫేస్‌బుక్ వంటి కంపెనీలు జియోలో ఇన్వెస్ట్ చేయడంతో ఒకానొక దశలో ఆయన ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో నాలుగో స్థానానికి కూడా చేరుకున్నారు. 2020 లో ముకేష్ అంబానీ సంపద 18.3 బిలియన్ డాలర్లు పెరిగి 76.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం రిలయన్స్ షేరు పడుతుండడంతో ఆయన సంపద కూడా తగ్గుతోంది.
తగ్గుతున్న టెక్ బిలినియర్ జాక్ మా సంపద..
అతిపెద్ద టెక్ కంపెనీ అలిబాబా గ్రూప్ ఫౌండర్ జాక్‌మా సంపద గత రెండు నెలల నుంచి పడుతూ వస్తోంది. తాజాగా చైనీస్ ప్రభుత్వం అక్కడి టెక్ కంపెనీలపై స్ర్కూటినీ పెంచింది. దీంతో 35 బిలియన్ డాలర్ల జాక్ మా యాంట్ గ్రూప్ ఐపీఓ ఆగిపోయింది. ఈ కంపెనీ బిజినెస్‌లను రీస్ట్రక్చర్ చేయాలని చైనీస్ గవర్న్‌మెంట్ తాజాగా వార్నింగ్ ఇచ్చింది కూడా. జాక్ మా కంపెనీల షేర్లు గత కొంత కాలం నుంచి పడుతున్నాయి. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం 2020 అక్టోబర్‌లో 61.7 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద, ప్రస్తుతానికి 11 బిలియన్ డాలర్లు తగ్గి 50.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రపంచంలోని ధనవంతుల లిస్ట్‌లో ఆయన పొజిషన్ 25 వ స్థానానికి తగ్గింది. కేవలం జాక్ మా కంపెనీ షేర్లే కాకుండా చైనీస్ స్టాక్ మార్కెట్లోని టెక్ కంపెనీల షేర్లు కూడా పడుతున్నాయి. పొనీ మా కంపెనీ టెన్సంట్ షేర్లు నవంబర్ నుంచి 15 శాతం పడ్డాయి.
