నీట్ రీ టెస్ట్ లో ఎన్‌‌టీఏ నిర్లక్ష్యం.. నాగ్ పూర్ అభ్యర్థికి అబుదాబిలో సెంటర్.. ఎన్‌‌టీఏ పై విమర్శలు

నీట్ రీ టెస్ట్ లో ఎన్‌‌టీఏ నిర్లక్ష్యం.. నాగ్ పూర్ అభ్యర్థికి అబుదాబిలో సెంటర్.. ఎన్‌‌టీఏ పై విమర్శలు

ముంబై: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌‌టీఏ) మరోసారి తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఆదివారమే( జూన్ 21) దేశవ్యాప్తంగా నీట్ రీ-టెస్ట్ నిర్వహించాల్సి ఉండగా.. మహారాష్ట్రకు చెందిన ఓ అభ్యర్థికి పొరపాటున యూఏఈ రాజధాని అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించింది. పరీక్షకు కేవలం ఒక్క రోజు ముందు బయటపడిన ఎన్‌‌టీఏ నిర్లక్ష్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

నాగ్‌‌పూర్‌‌కు చెందిన అబ్దుల్లా అనే విద్యార్థి నీట్ రీ-టెస్ట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. తన అప్లికేషన్‌‌లో నాగ్‌‌పూర్, వార్ధా, భండారాలను మాత్రమే పరీక్షా కేంద్రాలుగా ఎంచుకున్నాడు. కానీ, సిస్టమ్ అలాట్‌‌మెంట్‌‌లో పొరపాటు వల్ల అధికారులు అతనికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబిలోని ఒక పాఠశాలను పరీక్షా కేంద్రంగా కేటాయించారు. మొదట జరిగిన నీట్ పరీక్షను నాగ్‌‌పూర్‌‌లోనే రాసిన అబ్దుల్లాకు.. ఇప్పుడు అబుదాబి కేంద్రం రావడం చూసి అతని కుటుంబం షాక్ కు గురైంది. దీంతో తల్లిదండ్రులు వెంటనే ఎన్‌‌టీఏ హెల్ప్‌‌లైన్‌‌కు ఫిర్యాదు చేశారు.

 కాగా, ఈ ఇష్యూపై రాజకీయంగా ఒత్తిడి పెరగడంతో ఎన్‌‌టీఏ చర్యలు చేపట్టింది. అబ్దుల్లాకు అబుదాబి కేంద్రం కేటాయింపు వెనుక సాంకేతిక లోపం ఉందని స్పష్టం చేసింది. పొరపాటుపై ప్రస్తుతం అంతర్గత విచారణ జరుపుతున్నట్లు ఎన్‌‌టీఏ ప్రతినిధి సింగ్ తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన చర్చల అనంతరం.. అబ్దుల్లాకు నాగ్‌‌పూర్‌‌లోనే పరీక్షా కేంద్రాన్ని రీ-అలాట్ చేశామని తెలిపారు.