
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ముసాయిదా ఓటర్ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. ముసాయిదా జాబితా ప్రకారం.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 139 లొకేషన్లు, 407 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,04,288 మంది కాగా, మహిళలు 1,88,356 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు.
ఈ నెల 17 వరకు అభ్యంతరాల స్వీకరించనున్నారు. ఈ ఏడాది జులై 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారందరూ ఈ నెల 17 లోపు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. అలాగే, ముసాయిదా ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, మార్పులు, చేర్పులు, మృతుల పేర్ల తొలగింపు, పోలింగ్ కేంద్రాలు, నియోజకవర్గాల మార్పు చేసుకోవాలనుకునే వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.