జూబ్లీహిల్స్, వెలుగు: సిటీలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా గోదావరి జలాల మళ్లింపు, మల్లన్న సాగర్ పైప్లైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రెండు రోజులకు ఒకసారి కూడా నీరు అందక బస్తీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాగునీటితో పాటు రోజువారీ అవసరాలకు సరిపడా నీటిని సరఫరా చేయాలని సూచించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహ్మత్ నగర్, కార్మిక నగర్ డివిజన్లలో ఆయన పర్యటించారు.
స్థానిక బస్తీల్లో కొత్తగా ఏర్పాటు చేసిన పవర్ బోర్లను ప్రారంభించారు. వేసవిలో తాగునీటి కొరతను అధిగమించేందుకు, ట్యాంకర్లు వెళ్లలేని సన్నని గల్లీల్లో బోర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఉపశమనం లభిస్తుందన్నారు. మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు.
ముషీరాబాద్: రాంనగర్లోని అచ్చయ్య నగర్ కమిటీ హాల్ నిర్మాణానికి కిషన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్
ప్రారంభించారు.

