ముషీరాబాద్, వెలుగు: కష్ట జీవుల కన్నీటి కథలే నిజమైన ప్రజా సాహిత్యమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలురు గౌరీ శంకర్ తెలిపారు. మనం ఎవరి కోసమైతే రచనలు చేస్తున్నామో అవి ఆయా వర్గాల ఇంటి వాకిళ్ల వరకు వెళ్తేనే దాని ప్రయోజనం నెరవేరినట్లు అవుతుందని ఆయన చెప్పారు. సాహిత్య అకాడమీ ప్రచురించిన మహాత్మా జ్యోతి బాఫూలే, సావిత్రి బాయి ఫూలేకు సంబంధించిన కవితా సంకలనాలను ఆదివారం ఒక్కరోజే మూడు రాష్ట్రాల్లో 150 చోట్ల ఒకేసారి ఆవిష్కరించామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం రవీంద్రభారతిలోని అకాడమీ ఆఫీసులో ఆయన వెల్లడించారు.
వనపట్ల సుబ్బయ్య రాసిన బహుజన బావుటా దామెర రాములు రాసిన ‘నేను సావిత్రి ఫూలే మాట్లాడుతున్నాను’ అనే ఈ రెండు కవితా సంకలనాలను మొదట నాగ్‌పూర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటి ముందు, పుణె, నాందేడ్, సోలాపూర్, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఆవిష్కరించామని ఆయన తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని కవులు, కళాకారులు, ప్రజాస్వామ్యవాదులు, చేతివృత్తుల వారి వద్దకు తీసుకెళ్లి పుస్తకాలను ఆవిష్కరిస్తామని చెప్పారు.

