
- జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య
- గ్రామ పంచాయతీలోనే పురుగుల మందు తాగి బలవన్మరణం
వరంగల్/నర్సంపేట, వెలుగు: జూనియర్ పంచా యతీ సెక్రటరీ ఒకరు సూసైడ్ చేసుకున్నారు. గ్రామ పంచాయతీలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురంలో శుక్రవారం జరిగిందీ ఘటన. విషయం తెలుసుకున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలు నర్సంపేట మార్చరీ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జేపీఎస్ బైరు సోని (29) సూసైడ్‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వరంగల్ నుంచి అదనపు బలగాలను.. నర్సంపేట మార్చురీకి పంపారు.
డ్యూటీకి వచ్చిన కొద్దిసేపటికే..
వరంగల్ జిల్లా రంగశాయి పేటకు చెందిన రంగు ప్రసాద్‌తో నర్సంపేటకు చెందిన బైరు సోనికి తొమ్మిదేండ్ల క్రితం పెండ్లి జరిగింది. వీరికి 8 ఏళ్ల పాప ఉంది. రంగాపురం జీపీలో జూనియర్ పంచాయతీ సెక్రటరీగా సోని పని చేస్తున్నారు. మూడు రోజుల కిందట సమ్మెను వీడి విధుల్లో చేరారు. శుక్రవారం విధులకు హాజరయ్యారు. అయితే డ్యూటీకి వచ్చిన కొద్దిసేపటి తర్వాత పురుగుల మందు తాగడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో వెంటనే సోనిని నర్సంపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు.. ఆమె అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. ఏరియా హాస్పిటల్‌కు వెళ్లి సోని కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు.
నర్సంపేట మార్చురీ వద్ద ఉద్రిక్తత
సోని సూసైడ్ గురించి తెలుసుకున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలు నర్సంపేట మార్చురీ వద్దకు మధ్యాహ్నమే పెద్ద ఎత్తున చేరుకున్నారు. మార్చురీ నుంచి సోని డెడ్‌బాడీని తరలిస్తుండగా అడ్డుకున్నారు. సోని సూసైడ్‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మార్చురీ ఎదుట మూడు గంటల పాటు జేపీఎస్‌లు ఆందోళన చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇప్పించాలని కోరుతూ.. డెడ్‌బాడీ తరలింపును అడ్డుకున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల దాకా ఆందోళన కొనసాగింది. బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, పార్టీ నాయకుడు గోగుల రాణాప్రతాప్‌రెడ్డి తదితరులు మార్చురీ వద్దకు చేరుకుని ఆందోళనకు మద్దతు తెలిపారు.
భర్త వేధింపులతోనే సూసైడ్: ఏసీపీ
సోని భర్త ప్రసాద్‌ను మార్చురీ వద్దకు పోలీసులు రప్పించారు. అక్కడ అతడి స్టేట్మెంట్ రికార్డు చేశారు. సోని సూసైడ్‌కు ఆమె భర్త రంగు ప్రసాద్ అనుమానపు వేధింపులే కారణమని నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు చెప్పారు. అల్లుడి వేధింపుల వల్లే తన కూతురు సోని పాయిజన్ తీసుకుని సూసైడ్ చేసుకుందని ఆమె తండ్రి బైరు శ్రీనివాస్ పిటిషన్ ఇచ్చారని చెప్పారు. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య హామీ ఇచ్చారు. అయితే రాతపూర్వకంగా హామీ ఇవ్వాలంటూ జేపీఎస్‌లు పట్టుబట్టారు. ఈ సమయంలో స్థానికులకు, జేపీఎస్‌లకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సోని మృతదేహాన్ని నర్సంపేట టౌన్‌లోని పుట్టింటికి తరలించారు.
ఇప్పటికైనా రెగ్యులర్ చేయాలి: సెక్రటరీ సంఘాలు
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేయాలని సెక్రటరీ సంఘాలు కోరాయి. వరంగల్‌లో జేపీఎస్ బైరు సోనీ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నాయి. ఇకనైనా ప్రభుత్వం జేపీఎస్ లను చర్చలకు పిలవాలని, ఆత్మహత్యలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశాయి. సోనీ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరాయి. ఈ మేరకు పంచాయతీ సెక్రటరీస్ సెంట్రల్ ఫోరం (టీఎన్జీవో ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేశ్, విజయ్ కుమార్, పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూధన్ రెడ్డి, శ్రీనివాస్, తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు.
సోనీ చావుకు సర్కారే కారణం: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: ఆత్మహత్య చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్లో పరామర్శించారు. సోనీ ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోనీ మృతికి ముమ్మాటికీ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. సోనీ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ‘‘కొవ్వొత్తుల ర్యాలీ’’ నిర్వహించాలని బీజేపీ క్యాడర్‌కు ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి రాగానే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు పేస్కేల్ అమలు చేస్తామని ప్రమాణం చేయాలని సూచించారు.