- సబ్జెక్ట్ లేకే సభ నడవకుండా బీఆర్ఎస్ రాద్ధాంతం
- అసెంబ్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని, ఆయన మాట్లాడితే క్రెడిబిలిటీ ఏమైనా పడిపోతుందా? అని మంత్రి జూపల్లి కృష్ణారావు నిలదీశారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో జూపల్లి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. శాసనసభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతల దగ్గర ఎలాంటి సబ్జెక్ట్ లేదని, అందుకే సభ నడవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలోనే మద్యం ధరలు పెరిగినయ్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మద్యం ధరలు 300 శాతం పెరిగాయని మంత్రి జూపల్లి గుర్తుచేశారు. త్వరలోనే మార్కెట్‌లోకి మరికొన్ని కొత్త బ్రాండ్లు రాబోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న శాఖలతో తాను పూర్తి సంతృప్తితో ఉన్నానని చెప్పారు. కల్చరల్ శాఖ అన్నిటికంటే పెద్దదని, ప్రభుత్వం ఏ శాఖ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.
