- ఇప్పటికే ఖర్గ్ దీవిలో చాలా మటుకు తుడిచిపెట్టామని వెల్లడి
- సీజ్‌ఫైర్‌కు తాము సిద్దంగా లేమని తేల్చిచెప్పిన ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ చమురు ఎగమతులకు అత్యంత కీలకమైన ఖర్గ్ ఐలాండ్ పై మరిన్ని దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హార్మూజ్ జలసంధికి యుద్ధనౌకలు పంపాలని తమ మిత్రపక్షాలు చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ ను ఆయన కోరారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ లో ఆయన ప్రకటించారు. ఖర్గ్ దీవిలో చాలా వరకు తమ బలగాలు నాశనం చేశాయని తెలిపారు. సరదా కోసం కూడా ఖర్గ్ దీవిపై అటాక్ చేస్తామని చెప్పారు. ‘‘యుద్ధాన్ని ముగించేందుకు డీల్ కోసం ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు కనబడింది.
అయితే, అది జరగని పని” అని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే, హార్మూజ్ జలసంధి ద్వారా ఆయిల్ ను దిగుమతి చేసుకునే దేశాలు ఆ మార్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ఈ విషయంలో మేము ఆ దేశాలకు తాము సహాయం చేస్తామని వెల్లడించారు. ప్రతీదీ సజావుగా సాగేలా చూసేందుకు ఆయా దేశాలతో సమన్వయం చేసుకుంటామని ట్రంప్ పేర్కొన్నారు. కాగా.. యుద్ధం ఆరంభమై ఇప్పటికే రెండు వారాలు గడిచాయి.
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భీకరంగా దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా ఆ దాడులకు దీటుగా స్పందిస్తూ ప్రతిదాడులు చేస్తున్నది. ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో ఆ దేశానికి కీలకమైన ఖర్గ్ ఐలాండ్పై మరిన్ని దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు హార్మూజ్‌కు యుద్ధనౌకలు పంపాలన్న ట్రంప్ విజ్ఞప్తిపై ఆలోచిస్తున్నామని ఫ్రాన్స్, బ్రిటన్ తెలిపాయి.
ఇరాన్ దాడులతో ఆశ్చర్యపోయా
పశ్చిమాసియలో 8 దేశాలపై ఇరాన్ చేసిన దాడులకు ఆశ్చర్యపోయానని ట్రంప్ తెలిపారు. ‘‘యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాతో పాటు మరికొన్ని దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. చాలా భీకరంగా ఇరాన్ విరుచుకుపడింది. ఆ దాడులకు నేను ఆశ్చర్యపోయాను” అని ట్రంప్ పేర్కొన్నారు. సీజ్ ఫైర్ కోసం ఇరాన్ సిద్ధంగా ఉన్నా తాము సిద్ధంగా లేమన్నారు. సీజ్ ఫైర్ కుదరాలంటే ఇరు పక్షాలూ ఒప్పుకోవాలని, అప్పుడే యుద్ధం ముగిసే అవకాశాలు కనిపిస్తాయన్నారు. కానీ, ఇరాన్ ప్రతిపాదనకు తాము ఒప్పుకోబోమని ఆయన స్పష్టం చేశారు.
