కులగణన పారదర్శకంగా జరిగితేనే బీసీలకు న్యాయం: ఆర్.కృష్ణయ్య

కులగణన పారదర్శకంగా జరిగితేనే బీసీలకు న్యాయం: ఆర్.కృష్ణయ్య

అంబర్‌‌పేట్, వెలుగు: బీసీలకు సామాజిక న్యాయం సాధించే పోరాటంలో ప్రతి బీసీ బిడ్డ కీలక పాత్ర పోషించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం విద్యానగర్‌‌లోని బీసీ భవన్‌‌లో జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి హాజరైన ఆర్ కృష్ణయ్య, సిద్ధిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా అశోక్‌‌ను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల జనాభాకు అనుగుణంగా అన్ని రంగాల్లో వాటా కల్పించాలనే లక్ష్యంతో నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. కులగణన పారదర్శకంగా జరిగితేనే సంక్షేమ పథకాల రూపకల్పన, రిజర్వేషన్ల అమలు, బడ్జెట్ కేటాయింపులు మరింత శాస్త్రీయంగా ఉంటాయన్నారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీశ్ రాజేందర్, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.