పైసా ఫాయిదా లేదు.. వడ్డీ రేట్లు తగ్గించండి..యూబీఐ, పీఎన్బీ బ్యాంకులకు కాళేశ్వరం కార్పొరేషన్ విజ్ఞప్తి

పైసా ఫాయిదా లేదు..  వడ్డీ రేట్లు తగ్గించండి..యూబీఐ, పీఎన్బీ బ్యాంకులకు కాళేశ్వరం కార్పొరేషన్ విజ్ఞప్తి
  •     ఇప్పటివరకు చెల్లించిన దాంట్లో అసలు కన్నా వడ్డీలే ఎక్కువని వెల్లడి 
  •     ఈ రెండు బ్యాంక్ కన్సార్టియమ్​లతో  రూ. 18,691 కోట్ల రుణాలు
  •     రూ.5,025 కోట్ల అసలు, రూ.9,641 కోట్ల వడ్డీ,. బకాయి రూ. 13,589 కోట్లు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న భారీ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలని ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్’ లీడ్ బ్యాంకులను కోరింది. ఎంసీఎల్‌‌ఆర్‌‌(రుణాలపై నిర్ణయించే కనిష్ట వడ్డీ రేటు)పై విధించిన రిస్క్ ప్రీమియం తొలగించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కన్సార్టియమ్ లీడర్లుగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ) చీఫ్ జనరల్ మేనేజర్లకు వేర్వురుగా లేఖలు రాసింది. ప్రాజెక్ట్‌‌తో ప్రస్తుతం ప్రభుత్వానికి పైసా ఫాయిదా లేదని, ప్రభుత్వ సాయంతోనే అసలు, వడ్డీ చెల్లింపులు జరుగుతున్నాయని లేఖలో వివరించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి ఉన్నందున వడ్డీ నిష్పత్తి తగ్గితే చెల్లింపుల భారం తగ్గుతుందని పేర్కొన్నారు. 

తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి ఎంసీఎల్‌‌ఆర్ ఆధారిత ప్రామాణిక వడ్డీ రేట్లకే రుణాలను సవరించాలని లీడ్ బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. రెండు బ్యాంకుల కన్సార్టియమ్‌‌లతో కలిపి రూ. 18,691 కోట్ల రుణం ఉంది. ఇందులో ఇప్పటివరకు రూ.5025 కోట్ల అసలు చెల్లించగా, అంతకు రెట్టింపు స్థాయిలో రూ.9641 కోట్లు కేవలం వడ్డీ రూపంలోనే ప్రభుత్వం చెల్లించింది. ఇంకా రూ.13,589 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు రెండు బ్యాంకులు వేర్వేరుగా వసూలు చేస్తున్న వడ్డీ శాతాన్ని ఒక శాతం మేర తగ్గించాలని లేఖలో కోరారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫేజ్-1 (లింక్-1) పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, అనుబంధ ఎత్తిపోతల పథకాల కోసం ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలోని కన్సార్టియమ్ రూ.7,400 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని తర్వాత రూ.7,363 కోట్లకు సవరించారు. ఇందులో కాళేశ్వరం కార్పొరేషన్ ఇప్పటివరకు రూ.2,061 కోట్ల అసలు, వడ్డీ రూపంలో రూ.3,685 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. ప్రస్తుతం యూబీఐ కన్సార్టియమ్‌‌కు చెల్లించాల్సిన అసలు రూ.5,280 కోట్లుగా ఉంది. 

ప్రస్తుతం ఈ రుణాలపై 9.45 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా, దానిని ప్రస్తుత ఎంసీఎల్‌‌ఆర్ రేటు 8.75 శాతానికి తగ్గించాలని, రిస్క్ ప్రీమియం మార్జిన్‌‌ను పూర్తిగా తొలగించాలని కోరింది. ఫేజ్-2 కింద ఉన్న లింక్-2 (శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు), లింక్-3 (మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరు), లింక్-4ఏ (మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మ సాగర్) పనుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియమ్ ప్రారంభంలో రూ. 11,400 కోట్ల రుణాన్ని ఆమోదించింది. ఈ మొత్తాన్ని తరువాత రూ. 11,327 కోట్లకు సవరించారు. కాళేశ్వరం కార్పొరేషన్​ఇప్పటివరకు రూ.2,964 కోట్ల అసలుతో పాటు రూ.5,956  కోట్ల భారీ వడ్డీని సకాలంలో చెల్లించింది. ఇంకా బకాయి ఉన్న అసలు రూ.8,309 కోట్లుగా ఉంది. దీనిపై ప్రస్తుతం వర్తిస్తున్న 9.70 శాతం వడ్డీ రేటును ప్రస్తుత ఎంసీఎల్‌‌ఆర్ రేటైన 8.80 శాతానికి సవరించి, అదనపు స్ప్రెడ్ భారాన్ని తొలగించాలని కార్పొరేషన్ సదరు లేఖలో పీఎన్​బీ బ్యాంకును కోరింది.

ప్రభుత్వం సోవరిన్  గ్యారంటీగా ఉంది

బ్యాంకులు మంజూరు చేసిన ఈ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం సోవరిన్ గ్యారంటీ ఇవ్వడంతో పాటు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఫండింగ్ అగ్రిమెంట్లను కూడా కుదుర్చుకున్నట్లు లేఖలో కార్పొరేషన్ గుర్తుచేసింది. ప్రభుత్వం పక్కాగా గ్యారంటీ ఇవ్వడం వల్ల బ్యాంకులకు ఈ రుణాల ద్వారా ఎలాంటి ఆర్థిక ముప్పు ఉండదని, ఇది సురక్షితమైన లెండింగ్ పరిధిలోకి వస్తుందని తెలిపింది. గతంలో ఒప్పందం ప్రకారం వడ్డీలను ఏనాడూ బకాయి పెట్టకుండా రెగ్యులర్‌‌గా చెల్లించిన విషయాన్ని ప్రస్తావించింది. వడ్డీ రేట్లలో కోత విధించడం వల్ల కార్పొరేషన్ డెట్ సర్వీస్ కవరేజ్ నిష్పత్తి (డీఎస్​సీఆర్​) మెరుగుపడటమే కాకుండా, క్రెడిట్ రేటింగ్ కూడా మెరుగవుతుందని, దీంతో భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులకు మార్గం సుగమం అవుతుందని బ్యాంకర్లకు స్పష్టం చేసింది.