హెడ్ రెగ్యులేటర్​ దూరంగా కట్టడంతోనే మేడిగడ్డ కుంగింది

హెడ్ రెగ్యులేటర్​ దూరంగా కట్టడంతోనే  మేడిగడ్డ కుంగింది
  • గేట్ ఆపరేషన్లలో విఫలమవడం వల్లే సీసీ బ్లాకులు, లాంచింగ్ ఆప్రాన్స్ దెబ్బతిన్నయ్
  • జ్యుడీషియల్ కమిషన్ ఎదుట కాళేశ్వరంకార్పొరేషన్ ఎండీ హరిరామ్ వెల్లడి 
  • కార్పొరేషన్ కింద రూ.87,449.16 కోట్ల రుణాలు
  • ఇప్పటిదాకా వడ్డీలతో కలిపి రూ.29,737.06 కోట్లు చెల్లింపు 
  • కాళేశ్వరం కార్పొరేషన్ కిందనే పాలమూరుప్రాజెక్టు కోసం మరో 10 వేల కోట్ల లోన్ 
  • మహారాష్ట్ర సీఎంతో భేటీ తర్వాతే  కాళేశ్వరానికి రూపకల్పన జరిగిందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల హెడ్ ​రెగ్యులేటర్లను ఎగువన ఎక్కడో దూరంగా నిర్మించారని, ఫలితంగా డెడ్​ వాటర్​ స్టోరేజీ పెరిగిపోయి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి ఉండొచ్చునని కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరామ్​తెలిపారు. 2017 జనవరి 25న జరిగిన హైపవర్​కమిటీ మీటింగ్​లోని అంశాలను కాళేశ్వరం సీఈ ఫాలో కాలేదని చెప్పారు. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్​ జస్టిస్​పినాకి చంద్రఘోష్​ జరుపుతున్న ఓపెన్ కోర్టు విచారణలో భాగంగా శుక్రవారం హరిరామ్​ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ ఎందుకు కుంగిపోయింది? ఇది ఎవరి తప్పు? అని కమిషన్​ ప్రశ్నించగా.. తొలుత తనకు తెలియదని హరిరామ్ సమాధానమిచ్చారు. అయితే అఫిడవిట్​లో మాత్రం గేట్ ఆపరేషన్లలో విఫలమవడం వల్లే సీసీ బ్లాకులు, లాంచింగ్ ఆప్రాన్స్​ దెబ్బతిన్నాయని ఎందుకు చెప్పారని కమిషన్ నిలదీయగా.. అది నిజమేనని ఆయన చెప్పారు. ఆ తర్వాత బ్యారేజీల హెడ్ రెగ్యులేటర్లను దూరంగా నిర్మించారని, దాంతో డెడ్ వాటర్ స్టోరేజీ పెరిగిపోయి మేడిగడ్డ కుంగిపోయి ఉండొచ్చని తెలిపారు. 

అందుకే బ్యారేజీ సైట్ మార్పు.. 

మహారాష్ట్ర సీఎంతో సమావేశం తర్వాతే తెలంగాణ సీఎం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని కమిషన్ కు హరిరామ్ తెలిపారు.‘‘తొలుత ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు ప్రతిపాదించారు. అయితే దాని వల్ల తమ ప్రాంతంలో 3,780 ఎకరాలు ముంపుకు గురవుతాయంటూ మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలోనే 2015 ఫిబ్రవరిలో రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. 148 మీటర్లకు బ్యారేజీ ఎత్తును తగ్గించాలని మహారాష్ట్ర సీఎం కోరారు. అది సాధ్యం కాకుంటే ప్రతిపాదిత స్థలాన్నైనా మార్చే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో స్థలం మార్చే విషయంపై పునరాలోచిస్తామని తెలంగాణ సీఎం హామీ ఇచ్చారు. ఆ తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. దానికి సంబంధించిన మీటింగ్​మినిట్స్​పై నాటి ఇరిగేషన్ సెక్రటరీ ఎస్కే జోషి సంతకం కూడా చేశారు” అని వివరించారు. 

కాళేశ్వరం కార్పొరేషన్ కింద పాలమూరు.. 

కాళేశ్వరం కార్పొరేషన్​ద్వారా ఎన్ని రుణాలు తీసుకున్నారని కమిషన్​ప్రశ్నించగా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని పది బ్యాంకుల కన్సార్టియం నుంచి లోన్లు తీసుకున్నామని హరిరామ్​తెలిపారు. ఇంట్రెస్ట్​డ్యూరింగ్​కన్​స్ట్రక్షన్ (ఐడీసీ)తో కలిపి రూ.87,449.16 కోట్ల రుణాలు తీసుకున్నామని వెల్లడించారు. అందులో బ్యాంకులు రూ.62,825.39 కోట్లు విడుదల చేశాయని చెప్పారు. ఇప్పటిదాకా బ్యాంకులకు వడ్డీతో కలిపి రూ.29,737.06 కోట్లు చెల్లించామని వివరించారు. అయితే అసలు కన్నా వడ్డీలే ఎక్కువ చెల్లించారా? ఇంకా చెల్లించాల్సిన అసలు ఎంత ఉంది? అని కమిషన్ ప్రశ్నించగా..  రూ.64,212.78 కోట్ల మేర అసలు బాకీ ఉందని చెప్పారు. ప్రాజెక్ట్​కాస్ట్​ బెనిఫిట్ రేషియో ఎంత అని ప్రశ్నించగా.. 1:1.511 అని పేర్కొన్నారు. రుణాల చెల్లింపుకు ప్రభుత్వం బడ్జెట్​కేటాయింపులు చేసిందా? అని కమిషన్​ప్రశ్నించగా.. చేసిందని చెప్పారు. నెలకు రూ.950 కోట్ల మేర బ్యాంకులకు తాము చెల్లించామన్నారు. మరోవైపు ‘‘పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్​ఇరిగేషన్​స్కీమ్ ను కూడా కాళేశ్వరం కార్పొరేషన్​లోనే చేర్చి రుణాలు తీసుకున్నాం. ఈ ప్రాజెక్టు కోసం రూ.10 వేల కోట్ల రుణం తీసుకోగా, అందులో రూ.7,145.77 కోట్లను బ్యాంకులు రిలీజ్​చేశాయి” అని హరిరామ్​తెలిపారు. అయితే కాళేశ్వరం కార్పొరేషన్​లో పాలమూరు ప్రాజెక్టును ఎందుకు చేర్చారని, దాని వల్ల ప్రభుత్వానికి భారం కాదా? అని కమిషన్​నిలదీయగా.. తాము ప్రభుత్వం చెప్పినట్టే చేశామని వివరించారు. 

సర్కార్​ఆర్డర్స్ లేకుండానే సీడబ్ల్యూసీకి డీపీఆర్.. 

కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్​ను ఎవరు ప్రిపేర్ చేశారని కమిషన్​ప్రశ్నించగా.. వ్యాప్కోస్​ సంస్థ తయారు చేసిందని, దాన్ని 2017 ఫిబ్రవరిలో సెంట్రల్​వాటర్​కమిషన్​(సీడబ్ల్యూసీ)కి పంపించామని హరిరామ్ తెలిపారు. మాజీ ఈఎన్సీ(జనరల్) మురళీధర్ ఆదేశాల మేరకే తాను డీపీఆర్​ను సీడబ్ల్యూసీకి పంపానని చెప్పారు. ప్రభుత్వం నుంచి డీపీఆర్​కు సంబంధించి ఏవైనా ఆదేశాలు గానీ, లిఖితపూర్వకమైన ఉత్తర్వులు గానీ ఉన్నాయా? అని కమిషన్​ ప్రశ్నించగా.. అలాంటివేవీ లేవని బదులిచ్చారు. మరి ప్రభుత్వం నుంచి ఆదేశాల్లేకుండానే డీపీఆర్​ను సీడబ్ల్యూసీకి ఎలా సమర్పించారని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

సీఈవో లేకుండానే  కార్పొరేషన్ నడిపించారా? 

కాళేశ్వరం కార్పొరేషన్​కు సీఈవో ఉన్నారా? అని కమిషన్ ప్రశ్నించగా.. లేరు అని హరిరామ్ బదులిచ్చారు. దీంతో కంపెనీస్ యాక్ట్​ప్రకారం సీఈవోను కచ్చితంగా నియమించాల్సి ఉంటుంది కదా? అని కమిషన్ ప్రశ్నించింది. కార్పొరేషన్ ఏర్పాటు జీవోలోనూ సీఈవోను నియమిస్తామని పేర్కొన్నారు కదా? అని నిలదీసింది. ఇన్నేండ్లు సీఈవో లేకుండానే కార్పొరేషన్​ను నడిపించారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కంపెనీస్ యాక్ట్​2013 ప్రకారం కాళేశ్వరం కార్పొరేషన్​ను 2016 ఆగస్టులో ప్రభుత్వ సంస్థగా మార్చారని హరిరామ్ తెలిపారు. కాగా, హరిరామ్ ను కమిషన్ 91 ప్రశ్నలు అడిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరి మానస పుత్రిక? కార్పొరేషన్​ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? కార్పొరేషన్ ద్వారా ఎన్ని రుణాలు తీసుకున్నారు? ఎంత తిరిగి చెల్లించారు? తదితర ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వం 2015 అక్టోబర్ 6న జీవో 145 ద్వారా కాళేశ్వరం కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిందని హరిరామ్ చెప్పారు. చాలా ప్రశ్నలకు తెలియదని, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను రేపు సమర్పిస్తానంటూ  సమాధానాలు ఇచ్చారు.

ఫైనాన్షియల్ ​స్టేట్​మెంట్లను అసెంబ్లీలో పెట్టారా? 

యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్​మెంట్లను ప్రభుత్వానికి ఇచ్చారా? వాటిని ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిందా? అని హరిరామ్ ను కమిషన్ ప్రశ్నించింది. 2016–17 నుంచి 2020–21 వరకు ఫైనాన్షియల్​స్టేట్​మెంట్లను ప్రభుత్వానికి ఇచ్చామని, వాటిని అసెంబ్లీలో పెట్టారో లేదో మాత్రం తెలియదని ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘కార్పొరేషన్​కు ఇంటర్నల్​గా ఒక ఆడిటర్ ఉంటారు. ప్రతి నెలా అకౌంట్స్​తయారు చేస్తారు. జవహర్ ఏజెన్సీస్ అనే సంస్థ ఆడిటింగ్​చేస్తున్నది. అయితే ఏటా నిర్వహించే స్టాట్యూటరీ ఆడిటింగ్​కు సంబంధించి మాత్రం కంప్ట్రోలర్ అండ్​ఆడిటర్​ జనరల్​(కాగ్) మాత్రమే ఆడిటర్లను నియమిస్తుంది. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాలకు గాను రామకృష్ణ అండ్​ కో.. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు గాను నర్సింహారావు అసోసియేట్స్.. 2020–21కి గాను రామ్మూర్తి అండ్​ కో.. 2021–22, 2022–23 సంవత్సరాలకు గాను కృష్ణప్రసాద్​ను ఆడిటర్లుగా ఏర్పాటు చేసింది” అని వివరించారు.