- ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికీ ఆత్మ విమర్శ చేసుకోవట్లే: కవిత
- ప్రజలే తప్పు చేశారంటూ చులకనగా మాట్లాడుతున్నరు
- రాజకీయ పునరేకీకరణ అంటూ తెలంగాణ వ్యతిరేకుల్ని తెస్తున్నరు
- 75 ఏండ్ల జీవన్‌రెడ్డిని 25 ఏండ్ల యువకుడంటే.. యువత ఏం కావాలె
- గుంటనక్క ఆర్ఎస్ఎస్ నేతల్ని కలిశారని గుంపు మేస్త్రీ చెప్తున్నరు
- కోర్టు తీర్పుల్ని ప్రభావితం చేసేలా సీఎం ఎలా మాట్లాడుతారని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై బీఆర్ఎస్ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని, ప్రజలే తప్పు చేశారనేలా చులకన చేసి మాట్లాడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. జగిత్యాల సభలో 75 ఏండ్ల కురువృద్ధుడిని చేర్చుకుని రాజకీయ పునరేకీకరణ అంటున్నారని, తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తెచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామంటున్నారని విమర్శించారు. వెయ్యేండ్లయినా బీఆర్ఎస్ పార్టీ మారదని ఆగ్ర హం వ్యక్తం చేశారు.
మంగళవారం ఆమె హైదరా బాద్‌లోని జాగృతి ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. జగిత్యాల బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకత్వం పల్లెత్తు మాట కూడా అనకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటూ లోక్ సభలో మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, జనగణనపై ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం ఉండదని, అందుకే మహిళా కోటా బిల్లు వీగిపోయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.
తమ ఓటమికి ప్రజలకే కారణమని ఇప్పటికీ బ్లేమ్ చేస్తున్నారని మండిపడ్డారు. 75 సంవత్సరాల కురువృద్ధుడిని చేర్చుకుని ఆయనకే 25 ఏండ్లు తగ్గిపోయినయి నవ యువకుడు అంటే తెలంగాణలో ఉన్న యువత పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మేధావులు, విద్యావేత్తలు బీఆర్ఎస్ ఆలోచన విధానం ఎలా ఉంటున్నదో అర్థం చేసుకోవాలన్నారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమ నాయకత్వం రెండు సార్లు పదవులకు రాజీనామా చేసినప్పుడు తనకు వైఎస్ నాయకత్వం ఉంటే చాలు తెలంగాణ ఎందుకంటూ ప్రశ్నించిన వ్యక్తి.. ఉద్యమ నాయకత్వంపై రెండుసార్లు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు.
జగిత్యాల సభలో తెలంగాణ కోసం ఉరిమే ఉత్సాహంతో పోరాడిన ఉద్యమకారుల గురించి ఒక్క మాట మాట్లాడలేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులు భిక్షాటన చేసే దుస్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఏర్పాటు చేసే పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని, యువత భారీ సంఖ్యలో చేరాలని పిలుపునిచ్చారు.
బల ప్రదర్శనకు దిగిన్రంతే..
రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఒకే రోజు భారీ బహిరంగ సభలు పెట్టి ‘తూ కిత్నా అంటే..
మై కిత్నా’ అంటూ బలప్రదర్శనకు దిగుతున్నాయితప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ ఉత్తి కథలు చెప్తే.. కాంగ్రెస్ పార్టీ పిట్టకథలు చెప్పిందన్నారు. పార్టీల సెంట్రిక్ గా కాకుండా ప్రజల సెంట్రిక్ గా రాజకీయ నాయకత్వం ఉండాలని, అందుకే తాము కొత్త రాజకీయ శక్తిగా ఈనెల 25న వస్తున్నామని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఒక ఆడబిడ్డగా తాను ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. గుంట నక్క ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్లారని గుంపుమేస్త్రీ అన్నారని, ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి బీఆర్ఎస్ నాయకుడు వెళ్తే ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సీఎం వ్యాఖ్యలు
కాళేశ్వరం కేసులో ఏదో జరగబోతుందని కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సీఎం మాట్లాడుతున్నారని కవిత అన్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను తక్కువ చేసేలా సీఎం మాట్లాడారని విమర్శించారు. ఢిల్లీలో గుంటనక్క ఎవరిని కలిశారో చెప్పాలా? అంటూ ఆయనతో సీఎం డీల్ మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. ఎవరు ప్రతిపక్షంలో ఉండాలో, ఎవరు పాలకపక్షంలో ఉండాలో డిసైడ్ చేయాల్సింది ప్రజలు కదా? అని ప్రశ్నించారు. పదేండ్లు తానే సీఎంగా ఉంటానని ఎలా చెప్తారని.. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలు రెండోసారి ఓట్లేస్తారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులంటే లెక్కలేనితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. ఆర్టీసీలో కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని కవిత ఆరోపించారు.

