రివ్యూ: విక్రమ్

 రివ్యూ: విక్రమ్

విలక్షణ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్ సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. భిన్న కథాంశంతో విభిన్న నటనతో ఆయన ఫ్యాన్స్ను అలరిస్తారు. అందుకే కమల్ సినిమాలంటే జనాలు తెగ ఇంట్రస్ట్ చూపిస్తారు.  అయితే తమిళనాడులో పార్టీ స్థాపన, ఎన్నికల కారణంగా..కమల్ హాసన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. దీంతో కమల్ హాసన్ సినిమా కోసం అభిమానులు వెయి కళ్లతో ఎదురూశారు.  చివరకు నాలుగేళ్ల తర్వాత కమల్ హాసన్ వెండితెరపై సందడి చేశారు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ విక్రమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ.. ఎట్టకేలకు  విక్రమ్ మూవీ ఇవాళ (శుక్రవారం)  థియేటర్లో విడుదలైంది. విశ్వరూపం -2 సినిమా తర్వాత కమల్ నటించిన చిత్రం కావడంతో అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోయాయి. మరి ఈ అంచనాలను కమల్ హాసన్ అందుకున్నాడా..?  విక్రమ్ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం.

అసలు స్టోరీ ఏంటీ..
సిటీలో కోట్లాది విలువ చేసిన డ్రగ్స్ కంటైనర్ మిస్ అవుతుంది. అదే సమయంలో పట్టణంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలను ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ అమర్ను (ఫాహాధ్ ఫాజిల్) ప్రభుత్వం నియమిస్తుంది. అతను తన అండర్ కవర్ టీంతో కలిసి కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు.ఈ ఇన్వెస్టిగేషన్లో కర్ణన్ (కమల్ హాసన్) గురించి ఊహించని నిజాలు తెలుస్తాయి. అసలు ఎవరు కర్ణన్ ఎవరు.. కర్ణన్ పేరుతో ఇన్నాళ్ళు అందరి ముందు తిరిగిన వ్యక్తి ఎవరు..?  సిటీలో జరుగుతున్న వరుస హత్యలకు కర్ణన్కు సంబంధం ఏమిటి అనేది సస్పెన్స్.  మరోవైపు సంతానం( విజయ్ సేతుపతి) ఒక కరుడుగట్టిన డ్రగ్ స్మగ్లర్. డ్రగ్ కంటైనర్ కోసం అతను వెతుకుతూ ఉంటాడు. కర్ణన్, సంతానం,  అమర్ ఈ ముగ్గురు ఎలా కలిశారు? అసలు కర్ణన్కు ఏం కావాలి? వీరి ముగ్గురి కథలు చివరికి ఏమవుతాయి ? ఈ కథకు, కార్తీ 'ఖైదీ'కి సంబంధం ఏమిటి? అసలు రోలెక్స్ (సూర్య) ఎవరు? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ..
విక్రమ్ మూవీ ఔట్ అండ్ ఔట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. ప్రేక్షకుడిని ఎక్కడ చూపు తిప్పుకోనివ్వకుండా డీల్ చేశాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. కథ పెద్దగా లేకపోయినా.. తనకున్న టెక్నికల్ టీమ్ సపోర్ట్, కట్టిపడేసే స్క్రీన్ ప్లేతో మాజిక్ చేశాడు డైరెక్టర్. కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లాంటి నటీనటుల అద్బుతమైన పర్ఫార్మెన్స్ ఆడియన్స్ను కట్టిపడేస్తాయి.  ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగినట్లు అనిపించినా..అక్కడక్కడా వచ్చే ట్విస్టులతో ప్రేక్షకుడు థ్రిల్స్గా ఫీలవుతాడు. ఇక విజయ్ సేతుపతి ఇంట్రడక్షన్ అయితే అదిరిపోతుంది.  ఈ మూవీలో కార్తీ ఖైదీ మూవీ కథ, పాత్రలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సెకండాఫ్లో థియేటర్ విజిల్స్తో మోగిపోతుంది. లోకేల్ కనకరాజు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని చెప్పాలి.  గిరీష్ గంగాధర్ సినిమాటోగ్రఫీ ప్రతి షాట్లో కట్టిపడేస్తుంది.  అనిరుద్ బీజీయం సినిమాకు ప్లస్ పాయింట్. మొత్తంగా లోకేష్ కనకరాజ్ అద్భుతమైన యాక్షన్, థ్రిల్స్, ట్విస్ట్లతో మాయ చేశారు అనే చెప్పాలి. 

ఎవరెవరు ఎలా చేశారు.?
ఎప్పటిలాగే కమల్ హాసన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించాడు. ఈ ఏజ్లో కూడా తన స్టైల్ అండ్ స్వాగ్ తో ఆకట్టుకున్నాడు. ఓ సాంగ్లో డాన్సు కూడా వేసి అలరిస్తాడు.  ఫహద్ ఫాజిల్ నటన కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది.స్పెషల్ ఆఫీసర్ పాత్రలో టెర్రిఫిక్గా కనిపించాడు.అలాగే విజయ్ సేతుపతి సినిమాకు మరో హైలైట్. క్రూరమైన విలన్ పాత్రలో జీవించేశాడని చెప్పాలి.ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్లల్లో అదరగొట్టాడు. చివర్లో హీరో సూర్య స్పెషల్ అప్పీయరెన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది. కాళిదాస్ జయరాం తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అన్బరివ్ యాక్షన్ గురించి. ప్రతీ రెండు సీన్లకో యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ప్రతీ యాక్షన్ సీన్ను స్టైలిష్ గా కంపోజ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూయ్స్ బాగున్నాయి. నిర్మాతలు భారీ గా ఖర్చుపెట్టారు. కొన్ని డైలాగులు బాగున్నాయి. ఓవరాల్గా ‘విక్రమ్’ యాక్షన్ లవర్స్ కు ,కమల్ హాసన్ అభిమానులకు పండగే.
సగటు ప్రేక్షకుడికి మాత్రం ఫర్వాలేదనిపిస్తుంది. లోకేష్ కనకరాజ్ టేకింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్,టెక్నికల్ వర్క్ వల్ల ఓసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.


రన్ టైమ్ : 2 గంటల 54 నిమిషాలు
నటీనటులు: కమల్ హాసన్,ఫహద్ ఫాజిల్,విజయ్ సేతుపతి,సూర్య, కాళిదాస్ జయరాం,తదితరులు
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధర్
యాక్షన్: అన్బరివ్
మ్యూజిక్ : అనిరుధ్ 
నిర్మాతలు: కమల్ హాసన్,మహేంద్రన్
రచన,దర్శకత్వం: లోకేష్ కనగరాజ్

రిలీజ్ డేట్ : జూన్ 3,2022.