ఇంత ఘోరమైన చావా? చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది..

ఇంత ఘోరమైన చావా? చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది..

ఈ ఫోటోను చూసి ఏదో బొమ్మ బాగుందే అనుకుంటున్నారా? లేకపోతే ఇది ఏదో కంప్యూటర్ మాయాజాలం అనుకుంటున్నారా? అలా అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఈ ఫోటోలో ఉన్నది ఆస్ట్రేలియన్ కంగారూ. ఇదో హృదయవిదారక ఘటన. ఆస్ట్రేలియాలో నెలరోజులుగా బుష్ ఫైర్ కొనసాగుతూనే ఉంది. ఆ మంటలకు వందల ఎకరాల అడవి కాలి బూడిదయింది. ఆ మంటలను తప్పించుకునే క్రమంలోనే ఓ కంగారూ ఫెన్సింగ్ దాటేలోపే మంటలకు ఆహుతయింది. ఈ ఫోటోను చూస్తే చలించని వారంటూ ఉండరు. ఇటువంటి చావు చూడటానికే ఇంత భయంకరంగా ఉంటే.. మరి ఆ మంటల్లో పడ్డ కంగారూ ఎంతగా విలవిలలాడిపోయి ఉంటుందో ఎవరైన ఊహించగలరా?

ఆస్ట్రేలియాలో రోజురోజుకూ విస్తరిస్తున్న మంటలు వందల ఎకరాల అడవిని నాశనం చేస్తున్నాయి. ఆ మంటల్లో పడి వేల జంతువులు తమ ప్రాణాలను కోల్పోతున్నాయి. అటవీ ప్రాంతంలో వాతావరణం కలుషితమయి, బలమైన వేడి గాలులు వీస్తున్నాయి. స్థానిక మీడియా ప్రకారం.. బుష్ ఫైర్ మంటలకు ఇప్పటికే 480 మిలియన్లకు పైగా జంతువులు చనిపోయాయి. ఈ మంటలకు 900లకు పైగా గృహాలు ధ్వంసమయ్యాయి. మంటల పొగతో అక్కడి ఆకాశమంతా ఎర్రటి రంగులోకి మారిపోయింది. ఈ విపత్తు వల్ల అనేక హృదయవిదారక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి ఫోటోనే ఒకటి ఆన్‌లైన్‌లో తెగ వైరలవుతుంది. అడిలైడ్ హిల్స్‌లో మంటల్లో చిక్కుకున్న కంగారూ, ఫెన్సింగ్ దాటడానికి ప్రయత్నిస్తూ.. అందులో చిక్కుకొని మంటలకు ఆహుతయింది. ఆ ఫోటోలో కంగారూ.. ఫెన్సింగ్ దాటడానికి ప్రయత్నిస్తుండగా, మంటలు చుట్టుముట్టినట్లు తెలుస్తుంది. అందుకే ఆ కంగారూ.. ఫెన్సింగ్ మధ్యలో చిక్కకొని మంటల్లో కాలి చనిపోయింది. ఆ తర్వాత అది అలాగే ఫెన్సింగ్ పట్టుకొని వేలాడుతూ కనిపించింది. ఆ ఫోటోను బ్రాడ్ ఫ్లీట్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్టు చేశాడు.

మంటల కారణంగా దాదాపు 4,000 పశువులు, గొర్రెలు చనిపోయాయని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మంటల వల్ల ఇప్పటికే న్యూ సౌత్ వేల్స్‌లోని సుమారు 30% అడవి కాలిపోయిందని వోలోన్ గాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తెలిపారు. ఈ మంటలపై స్పందిస్తూ.. ఆస్ట్రేలియా ప్రజలకు తన సానుభూతి తెలియజేస్తూ..ఈ ఘటన చాలా దురదృష్టకరం అని 17 ఏళ్ల వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

కాగా.. ఆస్ట్రేలియాలో సోమవారం చల్లని గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. ఇది మంటలను మరియు మంటల నుంచి వేడి గాలులను కొంత వరకు తగ్గించింది. కానీ, ఈ మంటలు మరో వారం తర్వాత మళ్లీ చెలరేగే అవకాశముందని అక్కడి అధికారులు స్థానికులను హెచ్చరించారు.