అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడటంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) నుండి బయటకు వచ్చిన నటి రంజన నాచియర్, ఆ పార్టీపై, విజయ్ వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఆమె టీవీకేకు రాజీనామా చేసి, అధికార డీఎంకే (DMK) పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మార్పు తర్వాత ఆమె ఎదుర్కొంటున్న వేధింపులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరాయి.
అసభ్యకరంగా మార్ఫింగ్ ఫోటోలు
చెన్నై పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసిన రంజన, టీవీకే సోషల్ మీడియా మద్దతుదారులు తనను దారుణంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తన ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఫోన్ కాల్స్ ద్వారా వ్యక్తిగత బెదిరింపులకు పాల్పడుతూ, అత్యంత అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. టీవీకే పార్టీ గుర్తులను వాడుతున్న 'వర్చువల్ వారియర్స్' గ్రూపులే దీని వెనుక ఉన్నాయని ఆమె ఫిర్యాదు చేశారు.
పార్టీ మారితే వేధింపులా?
నేను పార్టీలో ఉన్నంత కాలం నన్ను 'అక్క' అని గౌరవించిన వారే, ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అని రంజన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తనకే కాకుండా, పార్టీ వీడాలనుకునే మహిళా సభ్యులందరికీ ఇలాంటి బెదిరింపులే ఎదురవుతున్నాయనన్నారు. అందుకే చాలా మంది భయంతో పార్టీలోనే ఉండిపోతున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె తమిళనాడు రాష్ట్ర మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు..
రాజీనామాకు అసలు కారణం అదేనా?
రంజన నాచియర్ టీవీకేను వీడటానికి బలమైన కారణాలు ఉన్నాయని ఆమె మీడియా ముందు వెల్లడించారు. ముఖ్యంగా విజయ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలు తనను కలచివేసాయన్నారు. విజయ్ భార్య వేధింపుల ఆరోపణలతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో, బయటకు మహిళా సాధికారత గురించి మాట్లాడే విజయ్.. ఇంట్లో మాత్రం మహిళలను గౌరవించట్లేదని ఆమె విమర్శించారు. తన కార్యకర్తలతో కనీసం మాట్లాడటానికి కూడా విజయ్ ఇష్టపడరని, ఆయన చేసేవన్నీ ఓట్ల కోసం ఆడే "పొలిటికల్ డ్రామాలు" అని ఆమె మండిపడ్డారు.
టీవీకే వ్యూహకర్తలపై విమర్శలు
ప్రస్తుతం టీవీకే డిజిటల్ వ్యూహాలను పర్యవేక్షిస్తున్న జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జునను కూడా ఆమె తన విమర్శల్లో ప్రస్తావించారు. పార్టీ శ్రేణులు ఇలాంటి నీచమైన వేధింపులకు పాల్పడుతుంటే విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని, దీనికి ఆయనే బాధ్యత వహించాలని రంజన డిమాండ్ చేశారు. మొత్తానికి, నటి రంజన నాచియర్ చేసిన ఈ ఫిర్యాదులు, ఆరోపణలు తమిళ చిత్రసీమలోనూ, రాజకీయాల్లోనూ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మరి ఆమె ఆరోపణలపై టీవీకే ఎలా స్పందిస్తుందో చూడాలి.
