సీఎంలతో ప్రధాని మోడీ మీటింగ్ స్టార్ట్.. చర్చ మొత్తం ఆ టాపిక్‎పైనే..!

సీఎంలతో ప్రధాని మోడీ మీటింగ్ స్టార్ట్.. చర్చ మొత్తం ఆ టాపిక్‎పైనే..!

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో ప్రధానంగా మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం. అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రం కావడంతో దేశంలో ఇంధన నిల్వలు, పెట్రోల్ బంకులు మూసివేత, లాక్ డౌన్ వంటి వార్తలపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలపైన డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ దేశంలో ఇంధన, గ్యాస్ కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని స్టేట్ల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

కాగా.. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని, దేశ ప్రజలు ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వదంతులను అడ్డుకోవడం, ప్రజల్లో భయాందోళనలు కలగకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రాల వారీగా గ్యాస్, పెట్రోల్ సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వివరించే అవకాశం ఉంది. సీఎంలతో భేటీ తర్వాత ఇంధన వినియోగం, ధరల నియంత్రణపై కేంద్రం మరిన్ని కీలక మార్గదర్శకాలు జారీ చేసే చాన్స్ ఉందని తెలుస్తోంది.